ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాప్ కోసం ఆందోళన

Telugu Lo Computer
0


బీహార్‌లోని లఖిసరాయ్‌లోని బరాహియా రైల్వేస్టేషన్‌లో రైళ్లను ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దాదాపు 40 గంటలపాటు నిరసన చేపట్టారు. అనేక మంది స్థానికులు రైల్వే ట్రాక్‌లపై టెంట్‌లు వేసి, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ కారణంగా హౌరా – ఢిల్లీ రైలు మార్గంలో డజన్ కు పైగా రైళ్లు 24 గంటల పాటు రద్దయ్యాయి. 100కి పైగా రైళ్లను దారి మళ్లించాల్సి పరిస్థితి ఏర్పడింది. బరాహియాలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాప్ లేదని, కానీ వాటిని ఆపాలంటూ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో రైల్వే ట్రాక్ పైకి వచ్చి నిరసన తెలిపారని  లఖిసరాయ్ కలెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. లఖిసరాయ్ లో తయారయ్యే రసగుల్లాకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా ఇది ప్రసిద్ధిగాంచింది. విపరీతమైన డిమాండ్ కారణంగా ఇక్కడి నుంచి స్వీట్లు రవాణా అధికంగా ఉంటుంది. ఇక్కడ తయారు చేసిన స్వీట్లను సమీప రాష్ట్రాలకు పంపిస్తుంటారు. వివాహ సమయంలో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆర్డర్లు తీసుకొని రసగుల్లా, ఇతర స్వీట్లను సరఫరా చేస్తుంటారు. లఖిసరాయ్ లో దాదాపు 200లకు పైగా స్వీట్ దుకాణాలు ఉన్నాయి. వీరంతా రోజుకు టన్నుల కొద్దీ రసగుల్లాలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. అయితే రైళ్లు బరాహియా స్టేషన్లో ఆగకపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు రవాణా చేయాల్సిన రసగుల్లాలను సకాలంలో అందించక పోలేక పోతున్నామని, రైలు కాకుండా ఇతర వాహనాలను ఆశ్రయిస్తే ఖర్చు ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగకపోవటంతో స్వీట్ దుకాణాల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని అక్కడి వ్యాపారులు వాపోయారు. రసగుల్లా దుకాణం వ్యాపారి రంజన్ శర్మ మాట్లాడుతూ.. ఇంతకుముందు ఈ వ్యాపారాన్ని రైళ్ల ద్వారా నిర్వహించడం ద్వారా ఖర్చు తక్కువగా, సమయానికి రవాణా చేయగలిగామని అన్నారు. కానీ ప్రస్తుతం రైళ్లు బరాహియా స్టేషన్లో ఆగకపోవటం వల్ల నష్టపోతున్నామని వాపోయాడు. ఇదిలా ఉంటే స్థానిక వ్యాపారుల ఆందోళనకు దిగొచ్చిన రైల్వే అధికారులు నెల రోజుల్లోగా ఒక ఎక్స్ ప్రెస్ రైలును బరాహియా స్టేషన్ లో ఆగేలా చూస్తామని, ఇతర రైళ్లు కూడా ఇక్కడ ఆగేలా మూడు నెలల్లో చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో దుకాణాల వ్యాపారులు నిరసన విరమించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)