షర్మిలా ఠాగూర్ నటీమణి. హిందీ సినిమాల ద్వారా ఎక్కువగా పేరు సంపాదించిన ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ఈమె ఇండియన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు అధ్యక్షురాలిగా అక్టోబరు 2004 - మార్చి 2011ల మధ్య పనిచేశారు. డిసెంబరు 2005లో ఈమెను యూనిసెఫ్ గుడ్‌విల్ ఎంబాసిడార్‌గా ఎన్నుకున్నారు. ఈమె 2009లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించారు. 2013లో ఈమెకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. షర్మిలా ఠాగూర్ డిసెంబరు 8, 1944న హైదరాబాదులో గీతీంద్రనాథ్ ఠాగూర్, ఇరా బారువా దంపతులకు జన్మించారు. ఈమె తండ్రి గీతీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్‌లో జనరల్ మేనేజర్‌గా హైదరాబాదులో పనిచేసేవారు. ఈయన బెంగాలీ కుటుంబానికి చెందిన వాడు కాగా ఇతని భార్య అస్సామీ కుటుంబానికి చెందినామె. ఈ ఇరువురు నోబెల్ పురస్కారగ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కు దూరపు బంధువులు. ప్రఖ్యాత సినిమా నటి దేవికారాణి, ప్రముఖ చిత్రకారుడు అవనీంద్రనాథ్ ఠాగూరులు కూడా షర్మిలకు దూరపు బంధువులవుతారు. ఈమె తన తల్లిదండ్రుల ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తె. ఈమె చెల్లెళ్లు ఓయిండ్రిలా కుందా, రొమీలా సేన్‌లు. పెద్ద చెల్లెలు ఓయిండ్రిలా ఈ కుటుంబం నుండి మొట్టమొదటి సినిమా నటి. ఆమె తపన్ సిన్హా తీసిన కాబూలీవాలా సినిమాలో మిని అనే పాత్రలో బాలనటిగా ఒకే ఒక సినిమాలో నటించారు. పెరిగి పెద్ద అయ్యాక అమె అంతర్జాతీయ బ్రిడ్జ్ క్రీడాకారిణిగా రాణించారు. ఇక రెండవ చెల్లెలు రొమీలా సేన్ బ్రిటానియా ఇండస్ట్రీస్ లో ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఈమె కలకత్తాలోని సెయింట్ జాన్స్ డయాసిస్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూలులోను, లోరెటో కాన్వెంటులోను చదివారు. ఈమె తన 13వ యేటనే సినీరంగ ప్రవేశం చేయడంతో చదువు పట్ల ఏకాగ్రత నిలుపలేక పోయారు. తన తండ్రి సలహాతో చదువుకు స్వస్తి చెప్పి నటన వైపు తన దృష్టిని సారించారు. 2009లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీలో షర్మిలా ఠాగూర్ కూడా ఒక సభ్యురాలు. షర్మిలా ఠాగూర్ నటిగా తన ప్రస్థానాన్ని 1959లో సత్యజిత్ రే తీసిన బెంగాలీ సినిమా అపుర్ సంసార్లో "అపర్ణ" పాత్రద్వారా ప్రారంభించారు. తరువాత ఈమె శక్తి సామంతా 1964లో తీసిన కాశ్మీర్ కీ కలీ చిత్రంలో కనిపించారు. తరువాత శక్తి సామంతా ఈమెతో అనేక సినిమాలు తీశారు. వాటిలో 1967లో వచ్చిన యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ ఒకటి. ఈ చిత్రంలో షర్మిలా ఠాగూర్ బికిని దుస్తుల్లో కనిపిస్తుంది. ఒక భారతీయ సినిమా నటి బికిని ధరించి నటించడం ఇదే తొలిసారి. ఈమె 1968లో ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ కవర్ పేజీకి బికిని వేసుకుని పోజు ఇచ్చింది. కానీ ఈమె కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్‌గా ఎన్నికైనప్పుడు భారతీయ సినిమాలలో కురచ దుస్తుల వినియోగం పెరిగినందుకు తన నిరసన వ్యక్తం చేశారు. ఈమె రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, నసీరుద్దీన్ షా మొదలైన నటుల సరసన నటించారు.1975లో గుల్జార్ తీసిన మౌసమ్ చిత్రంలో ఈమె నటనకు ఉత్తమ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. 2003లో గౌతం ఘోష్ తీసిన అభర్ అరణ్యె అనే బెంగాలీ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది. ఈమె 1969, డిసెంబర్ 27వ తేదీన పటౌడీ నవాబు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడిని వివాహం చేసుకుంది. ఈమె ముస్లిం మతంలోనికి మారి తన పేరును ఆయేషా సుల్తానాగా మార్చుకుంది. వీరికి సైఫ్ అలీ ఖాన్, సబా అలీఖాన్, సోహా అలీఖాన్ అనే ముగ్గురు సంతానం. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి 2011, సెప్టెంబరు 22న తన 70వ యేట మరణించారు.
షర్మిలా ఠాగూర్
December 12, 2021
0
Tags