ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో తమ కార్యకలాపాలను విస్తరించాలని రేమండ్ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణలో భాగంగా ఏరోస్పేస్, ఆటోమోటివ్ రంగాలకు చెందిన రెండు భారీ తయారీ యూనిట్లను రూ.943 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ఈ అధికారిక ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేమండ్ గ్రూప్ తన ఏరోస్పేస్, ఆటో రంగాలలో స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వెంచర్లకు దాదాపు రూ.695 కోట్ల ప్రోత్సాహకాలను మంజూరు చేసింది. ఈ రెండు యూనిట్ల ఏర్పాటు ద్వారా సుమారు 5,400 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు ఇప్పటికే ఆమోదించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 47.28 ఎకరాల భూమిని కేటాయించబోతోంది. టేకులోడు వద్ద ఏర్పాటు కానున్న ఆటోమోటివ్ వ్యాపార యూనిట్ కోసం జేకే మైని ప్రెసిషన్ టెక్నాలజీ మొత్తం రూ.430 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి రాష్ట్రం రూ.314 కోట్ల ప్రోత్సాహకాలను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ 4,096 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని కల్పించవచ్చు. ఏరోస్పేస్ వెంచర్ కోసం జేకే మైని గ్లోబల్ ఏరోస్పేస్ గుడిపల్లిలోని 47 ఎకరాల క్యాంపస్‌లో సుమారు రూ.510 కోట్లు పెట్టుబడి పెట్టి, 1,400 ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ వెంచర్‌కు సుమారు రూ.380 కోట్ల ప్రోత్సాహకాలు అందవచ్చు. రేమండ్ గ్రూప్ 2023లో మైని ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లో నియంత్రణ వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఏరోస్పేస్ తయారీ రంగంలోకి ప్రవేశించింది. ఆటో, ఏరోస్పేస్ భాగాలతో సహా హై-ప్రెసిషన్ ఇంజనీరింగ్‌లో మరింత పెట్టుబడి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు రాష్ట్ర సర్కారు రూపొందించిన ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 కింద ప్రత్యేకంగా అమలు చేయబడతాయి. ఈ ఫ్యాక్టరీల నిర్మాణం 2026 మార్చిలో ప్రారంభమై.. కమర్షియల్ ఉత్పత్తి 2027 మేలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. జేకే మైని ప్రెసిషన్ టెక్నాలజీ రేమండ్ గ్రూప్‌కు అనుబంధ సంస్థగా 1973లో స్థాపించబడింది. 2004లో ఏరోస్పేస్ రంగంలో అడుగు పెట్టిన ఈ సంస్థ.. ఉన్నత నాణ్యత గల మెషీన్డ్ కంపొనెంట్లు, అసెంబ్లీలు, ఏరో స్ట్రక్చర్లు తయారు చేస్తోంది. ఇక రేమండ్ లిమిటెడ్ మైని గ్రూప్‌ల సంయుక్త భాగస్వామ్యంతో జేకే మైని గ్లోబల్ ఏరోస్పేస్ అనే సంస్థ 2025 ఆగస్టులో అధికారికంగా ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లో ఏరోస్పేస్, ఆటోమోటివ్ రంగాల భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్న రేమండ్ గ్రూప్
October 09, 2025
0
Tags