గచ్చిబౌలి ఏఐజీ వద్ద ఉద్రిక్తత : లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన వ్యక్తి మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వద్ద వైద్యుల నిర్లక్ష్యంగానే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన వ్యక్తి మృతి చెందాడంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులతోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకుని.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన మురళీధర్ (40) లివర్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవన్‌దాన్‌లో లివర్ మార్పిడి కోసం నెలన్నర క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మురళీధర్ వయస్సు 40 ఏళ్లు అయితే 60 ఏళ్లుగా ఆసుపత్రి సిబ్బంది నమోదు చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లివర్ డోనర్స్ ఎవరూ ముందుకు రాలేదని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. దాంతో మురళీధర్ భార్య ముందుకు వచ్చి భర్తకు లివర్ ఇవ్వడంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ కోసం నిన్న రూ. 14 లక్షలను అతడి కుటుంబ సభ్యులు చెల్లించారు. అనంతరం మురళీధర్ మృతదేహాన్ని తీసుకుని వెళ్లాలంటూ అతడి కుటుంబ సభ్యులకు ఏఐజీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. నగదు చెల్లించిన తర్వాత ఈ విషయం వెల్లడించడంతో ఆసుపత్రి సిబ్బందిపై అతడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 45 రోజుల నుంచి ఇప్పటి వరకు ఆ ఆపరేషన్ నిమిత్తం రూ. 85 లక్షలు బిల్లు రూపంలో ఆసుపత్రికి చెల్లించామని వారు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం ఉన్న ఒక ఇల్లు సైతం విక్రయించి నగదు చెల్లించినట్లు మృతుని బంధువులు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలంటూ ఈ సందర్బంగా మురళీధర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)