తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ కి మోడీ ప్రభుత్వం రూ.100 కోట్లను నిధులు మంజూరు చేశారని, గోదావరి ఎక్కువ భాగం ప్రవహించే తెలంగాణకు మాత్రం ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు. తెలంగాణ భారతదేశంలో లేదా? తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వట్లే అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా రాష్ట్రానికి నిదులు ఇవ్వమని ఒక్కరికి కూడా నోరు తెరిచి అడిగే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ బీజేపీ కేంద్రం బక్వాస్ మాటలు మాట్లాడుతుందని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలో మల్లొచ్చే ప్రభుత్వం ఏదని ఎవరిని అడిగినా బీఆర్ఎస్ పక్కా అని అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. రెండేళ్లు గడిచిపోయింది, ఉన్నది ఇంకా రెండేళ్లు. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? : ఎందుకు నిధులు ఇవ్వరు ?
October 05, 2025
0
Tags