నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు అరెస్ట్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్ధన్‌ రావుని గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జనార్ధన్‌ రావు ఏ1గా ఉన్నాడు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నకిలీ మద్యం అంశం కేంద్రంగా కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేసింది. సీఎం చంద్రబాబును ఇరుకునపెట్టేలా తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. నకిలీ మద్యం తయారీ వెనుక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో ఎక్సైజ్‌ అధికారులు ఏడుగురిని నిందితులుగా చేర్చారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డిని ఏ17గా, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిని ఏ18గా పేర్కొన్నారు. వీరితో పాటు బాలాజీ, అన్బురాసు, రవి, అష్రఫ్‌, సుదర్శన్‌లపై కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే 14 మందిపై ఎక్సైజ్‌ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏడుగురిని చేర్చడంతో నిందితుల సంఖ్య 21 చేరింది. ప్రధాన నిందితుల కోసం బెంగళూరులో నిఘా పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)