శ్రీసన్‌ ఫార్మా సంస్థపై ఈడీ దాడులు !

Telugu Lo Computer
0


చెన్నైలో శ్రీసన్‌ ఫార్మాకు సంబంధమున్న ఏడు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్‌ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని సీనియర్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల నివాసాలు, శ్రీసన్‌ ఫార్మాకు సంబంధమున్న ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు సమాచారం. కోల్డ్‌రిఫ్‌ దగ్గు సిరప్‌ తాగి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో 24 మంది చిన్నారులు మృతిచెందారు. దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ను సూచించగా అందులోని విషపదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్‌రిఫ్‌ను నిషేధించాయి. మరోవైపు కోల్డ్​రిఫ్​ సిరప్​ తయారుచేసిన శ్రేసన్​ ఫార్మా యూనిట్​ యజమాని రంగనాథన్​ (73)ను ఇటీవల అరెస్ట్​ చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని వెల్లడించారు. ఈ కంపెనీని వారు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తనిఖీ చేయలేదన్నారు. దర్యాప్తులో భాగంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ పలు వైఫల్యాలను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దగ్గుమందు వికటించి మరణించిన వారిలో ఎక్కువగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారని ఇటీవల అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత వర్గాలు వెల్లడించిన నివేదిక ప్రకారం, రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ నిబంధనలను విస్మరించిందని, కేంద్ర సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపాయి. దగ్గుమందు తయారీ విషయంలో సరైన పర్యవేక్షణ లేదని, సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో విషపూరితమైన సిరప్​ మార్కెట్​లోకి ప్రవేశించి పిల్లల మరణాలకు కారణమయ్యిందని తెలిపాయి. ఆ ఫార్మా సంస్థలో ఏ ప్రభుత్వ ఏజెన్సీ ఆడిట్​ నిర్వహించలేదని తెలుస్తోంది. అదే విధంగా ఔషధ తయారీ సంస్థగా ఈ కంపెనీ కేంద్ర పోర్టల్​లో రిజిస్టర్​ కాలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. మధ్యప్రదేశ్​లో పిల్లల మరణాలకు కారణమని భావిస్తున్న కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం సోమవారం ప్రకటించింది. కోల్డ్‌రిఫ్ అనే దగ్గు సిరప్‌లో విషపూరిత కలుషితాలు, ముఖ్యంగా డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దగ్గమందు మరణాల నేపథ్యంలో తమిళనాడులోని తయారు కంపెనీలో తనిఖీలు చేయగా దుర్భరమైన మౌలిక సదుపాయాలు, జాతీయ ఔషధ భద్రతా నియమాలను అనేకసార్లు ఉల్లంఘించడం, దశాబ్ద కాలంగా నియంత్రణ లేకుండా కార్యకలాపాలను కొనసాగించడం వంటివి చేస్తోందని సెంట్రల్​ డ్రగ్స్ స్టాండర్డ్​ కంట్రోల్​ ఆర్గనైజేషన్​ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)