హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఆ సంస్థ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయే వరకు గాజాలో యుద్ధం ముగియదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ ప్రకటన మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాత్కాలిక శాంతిపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన నెతన్యాహు ప్రకటనకు కొద్ది సమయం ముందు హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇద్దరు బందీల మృతదేహాల అవశేషాలను రెడ్ క్రాస్ బృందానికి అప్పగించింది. రెడ్ క్రాస్ అందుకున్న ఈ అవశేషాలను ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది. అవి గుర్తింపు ప్రక్రియ కోసం ఇజ్రాయెల్‌కు తరలించబడ్డాయి. అయితే ఈ బందీల మృతదేహాల సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడమే కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి దశను పూర్తి చేయడంలో ప్రధాన అడ్డంకిగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ అమలు కావాలంటే.. యుద్ధం పూర్తిగా ముగియాలని, దాని కోసం హమాస్ కింది రెండు డిమాండ్లను తప్పక నెరవేర్చాలని నెతన్యాహు డిమాండ్ చేశారు. హమాస్ తన మిలిటరీ శక్తిని పూర్తిగా వదులుకోవాలని.. హమాస్ గాజా స్ట్రిప్‌పై తన సైనిక నియంత్రణను తొలగించుకోవాలని నెతన్యాహు షరతులు విధించారు. ఈ డిమాండ్లను హమాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, హమాస్ తిరిగి గాజాపై తమ పట్టును బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు తెలుపుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా విదేశాంగ శాఖ సైతం హమాస్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. గాజాలోని పౌరులపై హమాస్ దాడులు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు తమకు నమ్మదగిన సమాచారం ఉందని అమెరికా వెల్లడించింది. ఒకవేళ హమాస్ ఈ దాడులను కొనసాగిస్తే, పౌరుల భద్రత, కాల్పుల విరమణ ఒప్పందం చెక్కుచెదరకుండా ఉండటానికి కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది. నెతన్యాహు తాజా ప్రకటన, నిపుణుల అంచనాల ప్రకారం, ఈ కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కాదు, ఇది ఎప్పుడైనా రద్దు కావచ్చనే ఆందోళన మధ్యప్రాచ్యంలో నెలకొంది.
హమాస్ ఆయుధాలు విడిచి లొంగిపోయే వరకు గాజాలో యుద్ధం ముగియదు !
October 19, 2025
0
Tags