తెలంగాణలోని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు అమెరికాలో ఉంటున్నది. కొడుకు హనుమకొండలో నివసిస్తున్నాడు. వీరికి పది ఎకరాల మామిడి తోట, ఎల్కతుర్తి, హనుమకొండలో ఇండ్లు ఉన్నాయి. భార్య గోలి వసంత 2021లోకరోనాతో చనిపోయారు. శ్యాంసుందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి హనుమకొండలో ఉంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత కుమారుడు తన తల్లి పేరిట ఉన్న భూమిని, హనుమకొండలోని ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని శ్యాంసుందర్‌ను వేధించి, ఇంటి నుండి కొట్టి వెళ్లగొట్టాడు. దీంతో శ్యాంసుందర్ రెడ్డి ఎల్కతుర్తిలో ఉన్న ఇంటిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఎన్నిసార్లు కొడుక్కి కబురు పంపినా అతను రాకపోవడంతో మనస్తాపానికి గురైన శ్యాంసుందర్ రెడ్డి తనకు ఉన్న మూడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి దానంగా ఇవ్వాలని నిర్ణయించుకొని జిల్లా రెవెన్యూ అధికారులను కలిసి సంబంధిత పత్రాలు రాయించి, సంతకాలు చేశాడు. దాని కాపీని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. ఈ మేరకు భూమికి హద్దులు నిర్ణయించి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల బాగోగులు చూడని కొడుకులకు తన నిర్ణయంతో కనువిప్పు కలగాలని తెలిపాడు. ఆ భూమిలో స్కూల్ లేదా కాలేజీ ఏర్పాటు చేయాలని, దానికి తన భార్య గోలి వసంత పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయమై తహసీల్దార్ ప్రసాద్‌రావును వివరణ కోరగా, శ్యాంసుందర్ రెడ్డి తన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి అందజేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వినతిపత్రం అందించాడని, ఉన్నతాధికారుల సూచనల మేరకు, భూమిపై ఎలాంటి వివాదాలు లేకపోతే హద్దులు నిర్ణయించి, భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
కొడుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చిన తండ్రి !
October 15, 2025
0
Tags