పూర్వోదయ పథకం నిధులు మంజూరుకు కేంద్రానికి చంద్రబాబు నాయుడు వినతి

Telugu Lo Computer
0


సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, సహజ వనరులను వినియోగించుకోవడం, కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడం, ఉపాధిని కల్పించడం స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కోసం బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎంపిక చేసింది . 2024 కేంద్ర బడ్జెట్లో ప్రారంభించిన ఈ పథకం ఎంపిక చేసిన రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆయా రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులను కేటాయించి ఆ ప్రాంతాల పురోభివృద్ధికి రాష్ట్రాలకు కేంద్రం తమ వంతుగా సహాయం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ పథకానికి ఎంపిక కావడంతో ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి ఈ పథకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. పూర్వోదయ పథకంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈ పథకంతో రాష్ట్రంలో చేపట్టే వివిధ కార్యక్రమాలను ఆమెకు వివరించారు. దేశంలోని తూర్పురాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్రం ప్రారంభించిన ఈ పథకం కింద ఎంపిక అయిన ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం నిధులను ప్రాంతీయ పురోగతికి సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి సమగ్ర ప్రణాళికలను కూడా రూపొందించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో హార్టికల్చర్ ని ప్రోత్సహించడానికి ప్రణాళికలు చేసినట్టుగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కాఫీ తోటలు, జీడిపప్పు, కొబ్బరి తోటలను ప్రోత్సహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. కోస్తా ఆంధ్రలో ఆక్వా కల్చర్ కార్యకలాపాలను బలోపేతం చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తాము రూపొందించుకున్న ఈ ప్రణాళికలను అమలు చేయడానికి పూర్వోదయ పథకంలో తమకు నిధులను కేటాయించాలని, అప్పుడే తాము మంచి ఫలితాలను సాధించగలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ పథకం ద్వారా చేపట్టే ప్రాజెక్టుల ద్వారా ఉత్పాదకతను మెరుగు పరచడమే కాకుండా, తద్వారా ఉపాధి అవకాశాలను కూడా కల్పించడానికి వీలవుతుందన్నారు. ప్రజల ఆదాయ స్థాయిని గణనీయంగా పెంచడానికి వీలు కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)