పాత మొబైల్‌ ఫోన్లను అమ్ముతున్నారా ? తస్మాత్ జాగ్రత !

Telugu Lo Computer
0


తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలంలోని పెద్దనల్లబెల్లి గ్రామ సెంటర్‌ వద్ద దుమ్ముగూడెం పోలీసులు ఈ నెల 8వ తేదీన సాయంత్రం వేళ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నలుగురు వ్యక్తులు నాలుగు బైక్‌లపై దగ్గరగా వచ్చి, పోలీసులను చూసీచూడగానే తత్తరపాటుతో వెంటనే వెనుదిరిగి లక్ష్మీనగరం వైపు వేగంగా వెళ్తున్నారు. వారిని పోలీసులు వెంటనే వెంబడించారు. ఆ నలుగురిలో ఒకడిని నల్లబెల్లి శివారులో పట్టుకుని విచారించారు. బీహార్‌ రాష్ర్టానికి చెందిన అక్తర్‌ ఆలీఖాన్‌ 'పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తాం' అంటూ, ఊరూరా తిరుగుతుంటాడు. పాతవి, పాడైన మొబైల్స్‌ తీసుకుని ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తుంటాడు. ఈ మొబైల్స్‌ను బీహార్‌కు తీసుకెళ్లి వీటిని తన్వీర్‌, హలీమ్‌ అనే ఇద్దరు సైబర్‌ నేరగాళ్లకు ఇస్తాడు. ఆ నేరగాళ్లు ఈ మొబైల్‌ ఫోన్ల ఐఈఎంఐ నంబర్లు, మదర్‌ బోర్డు, సాఫ్ట్‌వేర్‌ సేకరించి, మరమ్మతులు చేస్తారు. ఆ తర్వాత, ఆ ఫోన్ల ద్వారా సైబర్‌ నేరాలు చేస్తారు. ఇలా వచ్చిన డబ్బులో నుంచి ఈ మొబైల్‌ ఫోన్లను సేకరించి తెచ్చిన అక్తర్‌ ఆలీఖాన్‌కు కమీషన్‌ ఇస్తారు. ఈ ఆలీఖాన్‌ నుంచి 150 పాత మొబైల్‌ ఫోన్లు, ప్లాస్టిక్‌ సామాన్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈ వివరాలను దుమ్ముగూడెం పోలీసులు గురువారం విలేకరులకు వెల్లడించారు. "పాత మొబైల్‌ ఫోన్లు కొంటామనిగానీ, వాటికి ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తామనిగానీ ఎవరైనా మీ ఊరికి/ఇండ్ల ముందుకు వస్తుంటారు. వారికి మీ ఫోన్లను ఇవ్వకూడదు" అని పోలీసులు హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)