తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పండుగకు చీరల పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో త్వరలోనే డ్వాక్రా గ్రూపుల మహిళలకు ఇందిర మహిళా శక్తి సంఘాల పేరుతో ప్రతి సంవత్సరం రెండు చొప్పున చీరలను పంపిణీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీరలు తయారీదారులతోను, కార్మికులతో మాట్లాడిన మంత్రి సీతక్క చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించడం కోసం తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి మరిన్ని ఆర్డర్లు వారికి ఇస్తామని దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుతున్నామని సీతక్క పేర్కొన్నారు. చీరలు తయారు చేయడం కోసం సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్ల కారణంగా నెలకు 25 వేల రూపాయల వరకు వస్తున్నాయని సీతక్క తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19వ తేదీన చీరలను పంపిణీ చేస్తామని సీతక్క చెప్పారు. మహిళా సంఘాల సభ్యుల గౌరవం పెంచేలా ఒకే రకం చీరలు ఇవ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బతుకమ్మ చీరలపైన నిర్ణయం తీసుకొని మహిళలందరికీ ఇచ్చేలా క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తామని సీతక్క తెలిపారు. ఇందిరమ్మ చీరల రెండో ఆర్డర్ ను కూడా త్వరలో ఇచ్చేలాగా సీఎం దృష్టికి తీసుకువెళతామని అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే కొందరు కోర్టులను ఆశ్రయించారని సీతక్క పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి సీతక్క వ్యక్తం చేశారు.
డ్వాక్రా మహిళలకు సంవత్సరానికి రెండు చీరలు పంపిణీ !
October 07, 2025
0
Tags