గోపాల్‌పూర్ - ఒడిశా మధ్య తీరం దాటనున్న వాయుగుండం

Telugu Lo Computer
0


వాయువ్య బంగాళాతంలో తీవ్ర వాయుగుండం గంటకు 17కి.మీ వేగంతో పయనిస్తూ తీరానికి సమీపించే కొద్దీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కళింగపట్నానికి 190 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. అర్ధరాత్రి గోపాల్‌పూర్ - ఒడిశా మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా మారింది. వాతావరణ శాఖ.. మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విశాఖలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్‌ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఎక్కడికక్కడ భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఏయూ, శంకరమఠం, సత్యం జంక్షన్‌, బీవీకే కాలేజీ రోడ్లలో చెట్లు విరిగిపడ్డాయి. కాగా, వాయుగుండం ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గాదిరాయిలో 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.8, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)