రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న వారిపై జీ7 కూటమి దేశాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. జీ7 కూటమి దేశాల ఆర్థిక మంత్రులు బుధవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించారు. కలిసికట్టుగా రష్యాపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆ దేశాన్ని ఆర్థికంగా కుంగదీసేలా రష్యా ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించేందుకు కూటమి దేశాలు అంగీకరించాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం తర్వాత రష్యా చమురు కొనుగోళ్లను పెంచుతున్న దేశాలనే తాము లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడించారు. హైడ్రోకార్బన్ దిగుమతులతో సహా రష్యా నుంచి తమ దేశాలు చేసుకుంటున్న దిగుమతులను దశలవారీగా తగ్గించే లక్ష్యంతో నిర్దిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక సహాయం చేసే దేశాలపై వాణిజ్య చర్యలు, ఇతర ఆంక్షలను తీవ్రంగా పరిశీలిస్తున్నామని మంత్రులు చెప్పారు. సమావేశం తర్వాత ఉమ్మడి ప్రకటన వెలువడింది. రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని ఇటీవల జీ7 దేశాలను అమెరికా కోరింది. భారత్‌పై తాము వేసిన అదనపు సుంకాలను ఉదాహరణగా చూపించింది. అయితే భారత్ కన్నా చైనా ఎక్కువగా ఆయిల్ కొనుగోలు చేసినా బీజింగ్‌పై అదనపు సుంకాలు విధించకుండా ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. జీ7 దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై ప్రభావం పడనుంది. అయితే ఈ మీటింగ్‌లో భారత్, చైనా పేరులు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ట్రంప్ వ్యూహాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రష్యా చమురు కొనేవారిపై జీ7 దేశాల ఆంక్షలు !
October 02, 2025
0
Tags