తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు 60 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కేటాయించింది. ఆయా హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాలు, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఈ మొత్తంతో కూడిన చెక్కులను ఆయా శాఖల సీనియర్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా, జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా యాప్‌ను ఉపయోగించాలని, విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హాస్టల్ విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని చెప్పారు. తరచూ హాస్టళ్లలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, అత్యవసర సమయాల్లో డాక్టర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్‌షిప్‌లు, సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను ఆదేశించారు. 24 గంటలూ ఆన్‌లైన్‌లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్‌ను ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని, వీటన్నింటికీ అవసరమైన యాప్‌లను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు రూ. 60 కోట్ల విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
October 14, 2025
0
Tags