నవంబర్‌ 23న నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించనున్న బ్రిటన్‌ ?

Telugu Lo Computer
0


లండన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నీరవ్‌ మోడీని త్వరలోనే భారత్‌కు అప్పగించేందుకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ అధికారులు నవంబర్‌ 23న నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అతన్ని ముంబైలోని ఆర్థర్‌ రోడ్డు జైలులో ఉంచనున్నట్లు సమాచారం. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు నీరవ్‌ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే అతను విదేశాలకు పారిపోయాడు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా నీరవ్‌ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఆర్థిక నేరగాన్ని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నీరవ్‌ మోదీ తమదేశంలోనే నివసిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో ప్రకటించింది. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేయగా 2019లో నీరవ్‌ మోదీని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. 2021, ఏప్రిల్‌లో అతన్ని భారత్‌కు అప్పగించాలని ఆ నాటి యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ ఆదేశించారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటిదాకా దేశ, విదేశాల్లోని రూ.2,596 కోట్ల విలువైన నీరవ్‌ ఆస్తుల్ని అటాచ్‌ చేసింది. ముంబైలోని బ్రాడీ హౌజ్‌ పీఎన్‌బీ శాఖ కేంద్రంగా ఈ కుంభకోణం జరిగింది. బ్యాంక్‌ ఉన్నతాధికారులతో కలిసి నకిలీ/మోసపూరిత ఎల్‌వోయూలతో నీరవ్‌, చోక్సీలు వేల కోట్ల రుణాలను పొందారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటిదాకా రూ.1,052.42 కోట్ల సొమ్మును పీఎన్‌బీ, ఇతర బ్యాంకులకు అప్పజెప్పినట్టు ఈడీ వర్గాలు చెప్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)