మూడేళ్ల కుమారుడిని చంపి మూసీలో విసిరేసిన కేసు : మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని బండ్లగూడ పరిధిలో మూడేళ్ల కుమారుడిని చంపి.. మూటకట్టి మూసీలో విసిరేసిన కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి పోలీసులు గాలించినా బాలుడి మృతదేహం లభించలేదు. దీంతో నయాపూల్‌ వద్ద మూసీలో ఆదివారం గాలింపు కొనసాగిస్తున్నారు. బండ్లగూడ నూరినగర్‌కు చెందిన మహ్మద్‌ అక్బర్‌ (35), సనాబేగం దంపతులకు పెద్దకుమారుడు (7), రెండో కుమారుడు మహ్మద్‌ అనాస్‌ (3) ఉన్నారు. అక్బర్‌ కూరగాయల వ్యాపారం చేస్తుండగా సనాబేగం నిలోఫర్‌ కేర్‌టేకర్‌గా చేస్తోంది. చిన్నకుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనిపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. దీంతో కన్నబిడ్డను చంపాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్లాక తెల్లవారుజామున అనాస్‌ తలపై దిండుతో ఊపిరాడకుండా చేశాడు. సంచిలో మృతదేహాన్ని కుక్కి బైక్‌పై తీసుకెళ్లి నయాపూల్‌ బ్రిడ్జి మీద నుంచి మూసీలో విసిరాడు. ఉదయం ఠాణాకు వెళ్లి తన బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. బంధువులు తీసుకెళ్లి తన ఇంటి దగ్గర దింపినట్లు ఫోన్‌ చేశారని.. అప్పటినుంచి కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు. అక్బర్‌పై అనుమానంతో ఫోన్‌ పరిశీలించగా ఎలాంటి కాల్స్‌ రాలేదు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున సంచితో వెళ్తున్నట్లు కనిపించింది. గట్టిగా ప్రశ్నించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)