ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనే షరతు పెట్టడం చిన్న పిల్లల మాటలా ఉందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో పార్టీల బలాల ఆధారంగా సమయం కేటాయించడం స్పీకర్ అధికారమని చెప్పారు. వ్యక్తిగత కోరికల కంటే వ్యవస్థ గొప్పదని వ్యాఖ్యానించారు. జగన్ సొంత పార్టీకి చెందిన ఛైర్మన్ ఉన్న మండలిలోనూ అదే విధానం నడుస్తోందనే విషయాన్ని ఆయన గ్రహించాలన్నారు. ''బిస్కెట్ ఇస్తేనే పాఠశాలకు వెళ్తాను అన్నట్టే ఉన్న జగన్ మాటలకు ప్రజలు నవ్వుతున్నారు. తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు తెదేపా ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారో గుర్తు చేసుకోవాలి. వైకాపా హయాంలో నడిపిన సభా విధానం ప్రజాస్వామ్య విరుద్ధం. జగన్ రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడం సభ హాజరుగా నమోదు కాదు'' అని యనమల రామకృష్ణుడు అన్నారు.
బిస్కెట్ ఇస్తేనే స్కూల్ కు వెళ్తాను అన్నట్లుంది జగన్ షరతు !
September 19, 2025
0
Tags