కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే ఎన్నో పౌర సేవలకు వన్‌స్టాప్ కేంద్రం ఉమంగ్ యాప్. రేషన్, గృహనిర్మాణం, పింఛన్లు, సామాజిక భద్రత పథకాలే కాదు, మరెన్నో సేవలనూ దీనిద్వారా పొందవచ్చు. ఈ-పరిపాలనలో భాగంగా కేంద్ర ఐటీశాఖ తీసుకువచ్చిన 'యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూఏజ్ గవర్నెన్స్'కు సంక్షిప్త రూపమే ఉమంగ్. ఇప్పటికే దేశవ్యాప్తంగా 8.81 కోట్ల మంది ఈ యాప్‌ను రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు 631.76 కోట్ల లావాదేవీలు పూర్తయ్యాయి. ఉమంగ్ యాప్‌లో ప్రజలు కోరుకున్న భాషలోనే సేవలను పొందవచ్చు. దీనిద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులూ చేసుకోవచ్చు. ఏవైనా సేవల్లో అంతరాయాలు ఏర్పడినా, సమస్యలు ఎదురైనా కస్టమర్ సపోర్ట్, లైవ్‌చాట్, ఏఐబాట్ వంటివీ అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఎక్కడున్నా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినా సొంత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పథకాలు, సేవలు పొందేందుకు వేదికగా నిలుస్తోంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్, ఐవోఎస్ యాప్‌స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం మొబైల్ నంబరుతో రిజిస్టర్ కావాలి. ప్రొఫైల్‌లో వ్యక్తిగత వివరాలు పొందుపరచాలి. ఆధార్ వివరాలు నమోదు చేయడం ద్వారా ఈ-కేవైసీ వేగంగా పూర్తవుతుంది. ఆధార్ ధ్రువీకరణతో కూడిన సేవలు పొందాలంటే ఉమంగ్ యాప్‌తో పాటు ఆధార్‌ఫేస్‌ఆర్‌డీ యాప్ తప్పనిసరి. ఫోన్‌లో యాప్ వేసుకున్న తర్వాత కుటుంబసభ్యులు వారికి అవసరమైన సేవల కోసం మల్టిపుల్ అకౌంట్లు యాడ్‌చేసే సదుపాయం ఉంది. డెస్క్‌టాప్ ద్వారా కూడా ఉమంగ్ సేవలు పొందవచ్చు. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సేవలు, రుణాలు ఇలా అన్నీ పొందవచ్చు. ఉమంగ్ యాప్ ఆరోగ్యం, పోలీస్, రైల్వే అత్యవసర సహాయకేంద్రాల నంబర్లకు వన్‌స్టాప్ సెంటర్‌గా పనిచేస్తుంది. వాతావరణం, గాలినాణ్యత కూడా తెలుసుకోవచ్చు. వయోధికులు పింఛన్ల కోసం లైఫ్ సర్టిఫికెట్లను పొందవచ్చు. పర్యాటకం, పోలీస్, న్యాయ, రేషన్, బిల్లుల చెల్లింపులు, ఈ-జిల్లా సర్వీసులు.. మహిళాశిశు సంక్షేమ, వయోవృద్ధుల, వ్యవసాయ, యువ, సామాజిక పింఛన్ల సేవలు.. ప్రజాఫిర్యాదులతోపాటు ఇతర ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య బీమా, బ్లడ్‌బ్యాంకు సేవలు. ఆదాయపన్ను సేవలు, జాతీయ పింఛను పథకం, ఎంపిక చేసిన బ్యాంకుల్లోని ఖాతాల్లోని బ్యాలెన్స్ ఇతర సర్వీసులు. ఈపీఎఫ్‌వో సేవలు, పాస్‌బుక్ బ్యాలెన్స్, క్లెయిమ్‌ల దాఖలు, యూఏఎన్ పొందడం, క్లెయిమ్ స్థితి, పింఛను తదితర వివరాలన్నీ లభ్యమవుతున్నాయి. ఎన్‌పీఎస్ కింద నగదు నిల్వ, అటల్ పింఛను పథకం వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్రాల వివిధ పోటీ పరీక్షలు, అకడమిక్ పరీక్షల ఫలితాలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉపకారవేతనాలకు దరఖాస్తు చేయవచ్చు. ఉద్యోగ సమాచారం లభిస్తుంది. రైల్వే సమాచారం, టికెట్ స్థితి.. కొన్ని రాష్ట్రాల మెట్రోరైలు సేవలు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రిజిస్ట్రేషన్, గ్యాస్ బుకింగ్, బిల్లుల చెల్లింపులు, వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు, పాస్‌పోర్టు స్లాట్‌ల సమాచారం, దరఖాస్తు స్థితి తెలుసుకోవచ్చు.
పౌర సేవలకు వన్‌స్టాప్ కేంద్రం ఉమంగ్ యాప్ !
September 04, 2025
0
Tags