కీవ్‌పై రష్యా భారీ డ్రోన్, క్షిపణి దాడులు : ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


క్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ డ్రోన్, క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. 11 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత కీవ్ లో ఓ ప్రధాన ప్రభుత్వ భవనం పైకప్పు నుండి పొగలు వెలువడటం కనిపించింది. అది కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ భవనం కావొచ్చని అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది. ఇది ప్రత్యక్ష దాడి వల్ల సంభవించిందా? లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ఒకవేళ అది ప్రత్యక్ష దాడే అని తేలితే- రష్యా వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేసినట్టవుతుందని అంచనా వేసింది. రష్యా ఇప్పటివరకు కీవ్ ను తన టార్గెట్ గా చేసుకోలేదు. ఎటువంటి ప్రభుత్వ భవనాలపైనా నేరుగా దాడులు జరపలేదు. పరోక్షంగా అవి పాక్షికంగా ధ్వంసమౌతూ వచ్చాయి. ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా ఉక్రెయిన్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ బిల్డింగ్ పై డ్రోన్లతో దాడులకు దిగడం చర్చనీయాంశమౌతోంది. మృతుల్లో ఏడాది వయస్సున్న ఓ చిన్నారి కూడా ఉన్నట్లు కీవ్ సిటీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ టిమూర్ తెలిపారు. ఆ చిన్నారి మృతదేహాన్ని శిథిలాల నుండి రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. అలాగే కీవ్‌ శివార్లలోని స్వియాటోషిన్ స్కీ, డార్నిట్ స్కీ జిల్లాల్లోని నాలుగు అంతస్తుల నివాస భవనాలపై రష్యా డ్రోన్ శకలాలు పడినట్లు మేయర్ విటాలీ చెప్పారు. రెండు వారాల వ్యవధిలో కీవ్‌పై రష్యా జరిపిన రెండో భారీ డ్రోన్, క్షిపణి దాడి ఇది. శాంతి చర్చలపై ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రమౌతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోండటం, వ్లాదిమిర్ పుతిన్ కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యుద్ధం జోరు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)