అండమాన్ తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపురం-2 బావిలో సహజ వాయువు కనుగొనబడింది. ఇందుకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం ప్రకటన చేశారు. దీనిని ''ఇంధన అవకాశాల సముద్రం'' అని పేర్కొన్నారు. ఈ గ్యాస్ నమూనాలలో అధిక మీథేన్‌ను చూపించడం భారత్‌కు శుభపరిణామం అని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకారం 2,212-2,250 మీటర్ల లోతులో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలలో సహజ వాయువు ఉనికిని గుర్తించాం. అప్పుడప్పుడు మంటలు కూడా చెలరేగాయి. విశ్లేషణ కోసం కాకినాడకు పంపిన నమూనాలలో 87 శాతం మీథేన్ ఉన్నట్లు కనుగొనబడింది. ఇది హైడ్రోకార్బన్ నాణ్యతను నిర్ధారిస్తుంది. రాబోయే నెలల్లో గ్యాస్ పూల్ పరిమాణం, దాని వాణిజ్య సాధ్యత ధృవీకరించబడుతుందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే అండమాన్ బేసిన్‌లో సహజ వాయువు సమృద్ధిగా ఉందనే భారతదేశం దీర్ఘకాల నమ్మకాన్ని ఈ ఆవిష్కరణ బలపరించింది. ప్రధాని మోడీ గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రకటించిన డీప్ వాటర్ మిషన్ కింద కొత్త ఆవిష్కరణలను కనుగొనడానికి, హైడ్రోకార్బన్ నిల్వలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి మన ఆఫ్‌షోర్ బేసిన్‌లలో పెద్ద సంఖ్యలో డీప్ వాటర్ అన్వేషణ బావులను ప్లాన్ చేస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. సహజ వాయువు ఉనికి ప్రపంచ డీప్ వాటర్ అన్వేషణ నిపుణులతో సమన్వయంతో దేశం తన అన్వేషణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని చెప్పారు. భారతదేశం అమృత్ కాల్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని పేర్కొన్నారు.
అండమాన్ సముద్రంలో సహజ వాయువు !
September 27, 2025
0
Tags