'ఎక్స్' చీకటి శక్తులకు అడ్డాగా మారిందని అమెరికా అధ్యక్షుడి వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. దీనిలో వ్యాప్తిచెందే హింసాత్మక సమాచార వ్యాప్తికి ఎలాన్ మస్క్ బాధ్యత వహించాలన్నారు. లాస్ ఏంజెలెస్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఇటీవల ఎక్స్‌లో చేసిన తీవ్ర వ్యాఖ్యలపై నవారో ఇలా స్పందించారు. అత్యంత చెత్తగా మారిన ఎక్స్ వేదికను ఎలా మారుస్తారు. అనామక, గుర్తు తెలియని పోస్టులకు చోటు ఉండొద్దు. విదేశీయులు మీ వేదికను వాడుకొని ఇక్కడి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసేందుకు అవకాశం ఇవ్వొద్దు. చీకటి శక్తులకు ఎక్స్ అడ్డాగా మారింది. ముందు ఎక్స్‌ను బాగు చేయాలి'' అని పేర్కొంటూ మస్క్‌ను ఉద్దేశిస్తూ నవారో పేర్కొన్నారు. ఎక్స్ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థపైనా నవారో ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటూ లాభపడుతోందని నవారో చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌లో ప్రతికూల స్పందనలు వచ్చాయి. ఆ పోస్టును ఎక్స్ కూడా ఫ్లాగ్ చేసింది. ఇంధన భద్రత కోసమే భారత్ కొనుగోలు చేస్తోందని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికాలోని ఉటాలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను ప్రశంసిస్తూ కొందరు ఎక్స్‌లో పోస్టుల పెడుతుండటాన్ని మస్క్ ఖండించారు. ఇటువంటి వాటిని అదుపుచేయకపోతే వ్యక్తులకు బెదిరింపులు పెరుగుతాయన్నారు. అయితే మస్క్ సారథ్యంలోనే ఎక్స్ ఉందన్న అంశాన్ని నవారో గుర్తు చేశారు.
చీకటి శక్తులకు అడ్డాగా మారిన 'ఎక్స్' : పీటర్ నవారో
September 16, 2025
0
Tags