అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ వర్చువల్‌గా సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితులతో సహా పలు కీలక అంశాలపై చర్చించారు. స్వాతంత్ర్యానికి మద్దతు ఇస్తున్నామంటూ చైనాను అదుపు చేసేందుకు తైవాన్‌ను పావుగా ఉపయోగించుకోవాలని చూడొద్దని డాంగ్ పేర్కొన్నారు. తమ విషయాల్లో జోక్యం చేసుకొనే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన యూఎస్‌ను హెచ్చరించారు. ఈ సందర్భంగా తైవాన్ తమ భూభాగంలో భాగమని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉన్న వాషింగ్టన్ రక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. కొన్ని దేశాలు దక్షిణ చైనా సముద్రంలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలను చేపట్టాయని డాంగ్ ఆరోపించారు. బయటి దేశాలు అశాంతిని సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. సమానమైన, గౌరవప్రదమైన శాంతియుతంగా ఉండే సైనిక సంబంధాన్ని నిర్మించుకోవాలని ఈ సందర్భంగా డాంగ్ పిలుపునిచ్చారు. ఒకరి ప్రయోజనాలను మరొకరు గౌరవించుకోవాలన్నారు. వాషింగ్టన్‌తో సైనిక సంబంధాలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చైనాతో చర్చలు అద్భుతంగా జరిగాయని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ పేర్కొన్నారు. బీజింగ్‌తో ఎలాంటి వివాదాన్ని తాము కోరుకోవడం లేదని హెగ్సేత్ ఆ దేశానికి స్పష్టంచేశారని పార్నెల్ తెలిపారు. చైనాలో పాలన మార్పును కోరడం లేదన్నారు. ఆసియా- పసిఫిక్ తీరంలో చైనా ఆధిపత్యాన్ని హెగ్సేత్ ఈసందర్భంగా ఖండించినట్లు వెల్లడించారు. తైవాన్ జలసంధిలో శాంతికి మద్దతు తెలపడంతో పాటు అంతర్జాతీయ జలాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయని హెగ్సేత్ పునరుద్ఘాటించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య తదుపరి చర్చలకు ఇద్దరు మంత్రులు అంగీకరించారు.
తమ విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలు మానుకోవాలని అమెరికాను హెచ్చరించిన చైనా
September 11, 2025
0
Tags