ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటూరి దీపికకు కలరా వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరో 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అంగలకుదురు గ్రామానికి చెందిన ఇంటూరి దీపిక (33) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె డెంగ్యూతో బాధపడుతూ ఈనెల 14న స్వగ్రామం వచ్చారు. చికిత్స తీసుకున్నా వాంతులు, విరేచనాలు తగ్గలేదు. ఈనెల 18న దీపిక డయేరియా లక్షణాలతో బాధపడుతూ తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. 19న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కలరా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. అంగలకుదురు గ్రామంలో వైద్యారోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, భయపడాల్సింది ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.
అంగలకుదురు గ్రామంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కలరా : వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తత
September 22, 2025
0
Tags