వైకాపా ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారన్నారు. బెల్టుషాపులు, నకిలీ మద్యం అమ్మకాలపై శాసన మండలిలో చర్చ సందర్భంగా వైకాపా ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మద్యం విషయంలో అంతా మంచి జరిగిందని వైకాపా చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ''మద్యం కుంభకోణంపై సిట్ విచారణ జరుగుతోంది. త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయి. మద్యం దుకాణదారులు తప్పు చేస్తే జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం. సరఫరా పర్యవేక్షణకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో లిక్కర్ పాలసీని చాలా పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మనం అమలు చేసే పాలసీని పక్క రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు. నాసిరకం మద్యం అమ్మినవారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో లిక్కర్ వల్ల చనిపోయినట్లుగా ఎక్కడా కేసు నమోదు కాలేదు'' అని కొల్లు రవీంద్ర తెలిపారు.
మనం అమలు చేసే మద్యం పాలసీని పక్క రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి !
September 18, 2025
0
Tags