తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణ వచ్చేనెల 8న చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న వెల్లడించారు. ఈ కేసులో విచారణకు ప్రభాకర్‌రావు ఏమాత్రం సహకరించడం లేదని మరోసారి కోర్టుకు సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్, కంప్యూటర్ల పాస్‌వర్డ్ చెప్పేందుకు ఆయన సహకరించడం లేదన్నారు. విచారణకు సహకరించని ప్రభాకర్‌రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. కోర్టు నోటీసులు జారీ చేసిన తర్వాత రాష్ట్రానికి రాకుండా వేరే చోట నుంచి అమెరికా పారిపోయారన్నారు. ఆయన ఇంట్లో కంప్యూటర్ నుంచి ఆధారాలు తొలగించారన్న విషయంపైనా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పారు. అధికారికంగా ఇచ్చిన ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైళ్లను ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఆధారాలన్నీ చెరిపేసినట్లు ఫొరెన్సిక్ నివేదికలో స్పష్టమైందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. కానీ వాటన్నింటినీ తొలగించే ప్రయత్నాలు చేశారని పేర్కొంది. గుర్తు లేదు, తెలీదు అన్న రీతిలో ప్రభాకర్‌రావు సమాధానం ఇస్తున్నారు తప్ప, దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మారినప్పుడు అధికారులు తమకు ఇచ్చిన అన్ని పరికరాలను యథాతథంగా వెనక్కి ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని.. కానీ వాటిని తుంగలోతొక్కి డేటా మొత్తాన్ని ప్రభాకర్‌రావు డిలీట్ చేశారన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా ప్రభాకర్‌రావు వెళ్లారని ఆయన తరఫు సీనయర్ న్యాయవాది శేషాద్రినాయుడు కోర్టుకు తెలిపారు. 15 సార్లు విచారించారన్నారు. రాజకీయ కారణాలతో ఆయన్ను వేధిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరినీ పిలిచి ప్రభాకర్‌రావుకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని తెలిపారు. మధ్యంతర బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని శేషాద్రి నాయుడు కోరగా రెండు వారాల సమయమిస్తూ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
విచారణకు ప్రభాకర్‌రావు ఏమాత్రం సహకరించడం లేదు : సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా
September 22, 2025
0
Tags