రోడ్లపై గుంతల వల్ల చనిపోతే మున్సిపాల్టీదే బాధ్యత : బాంబే హైకోర్టు కోర్టు తీర్పు

Telugu Lo Computer
0


రోడ్ల మీద ఏర్పడే గుంతల కారణంగా ప్రమాదాలు సంభవించి గాయపడటం, చనిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే వాటికి సదరు మున్సిపాలిటీలు, అధికారులను బాధ్యులను చేయాలని బాంబే హైకోర్టు తెలిపింది. అలానే రోడ్ల మీద గుంతల వల్ల ఏర్పడే ప్రమదాల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు ఓ విధానాన్ని రూపొందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందో లేదా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమాచారాన్ని తమకు తెలపాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది ఓఎస్‌ చందూర్కర్‌ని జస్టిస్‌ రేవతీ మొహితే, జస్టిస్‌ సందేశ్‌ బీ పాటిల్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి ప్రమాదాలకు మున్సిపల్‌ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేయాలన్న కోర్టు.. పరిహారం మొత్తాన్ని కూడా మున్సిపల్‌ అధికారుల జీతాల నుంచే రాబట్టాలని సూచించింది. అలానే ఈ ప్రమాదాలకు కారణమైన వారికి చిన్న జరిమానా సరిపోదని,  వారికి కూడా నొప్పి తెలియాలంటే భారీ మొత్తంలో జరిమానా విధించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. రోడ్లపై గుంతల వల్ల సంభవిస్తున్న మరణాలపై తాజాగా బాంబే హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రోడ్ల దుస్థితికి కాంట్రాక్టర్లను కూడా బాధ్యులుగా చేయాలని బీఎంసీతో పాటుగా ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లోని అన్ని మున్సిపాలిటీలకు కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లకు రూ.1 లక్ష-రూ. 10 లక్షల వరకు జరిమానాలు విధించినట్లు న్యాయవాది తెలపగా, కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందుతున్న వారికి ఈ జరిమానాలు సరిపోవని ధర్మాసనం అభిప్రాయపడింది. వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ సమస్యను తాము విస్తృతమైన అంశంగా పరిగనిస్తున్నామన్న హైకోర్టు, రోడ్డు మీద గుంతల కారణంగా ఎవరైనా చనిపోతే, లేదంటే గాయపడితే అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించింది. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)