ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఆకతాయి పనికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి హాస్టల్ రూమ్‌లో నిద్రిస్తున్న ఎనిమిది మంది విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ పోశారు. ముగ్గురు విద్యార్థులు కళ్లు అంటుకుపోవడంతో తెరువలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ హాస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి ఎనిమిది మంది విద్యార్థులను తొలుత గోచ్చపాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఫుల్బానిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఫెవిక్విక్ వల్ల ఆ విద్యార్థుల కళ్లకు నష్టం కలిగిందని డాక్టర్లు తెలిపారు. అయితే సకాలంలో వారిని హాస్పిటల్‌కు తీసుకురావడంతో చికిత్స అందించినట్లు చెప్పారు. ఒక విద్యార్థిని డిశ్చార్జ్ చేయగా మిగతా ఏడుగురు స్టూడెంట్స్‌ను పరిశీలనలో ఉంచినట్లు వెల్లడించారు. సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రిని సందర్శించి ఆ విద్యార్థులను పరామర్శించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్కూల్ హెడ్‌మాస్టార్ మనోరంజన్ సాహును సస్పెండ్ చేశారు. హాస్టల్ లోపల ఈ సంఘటన ఎలా జరిగింది అన్నది దర్యాప్తు చేస్తున్నారు. సూపరింటెండెంట్‌తో సహా వార్డెన్లు, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. హాస్టల్‌లో ఉన్న పిల్లలు ఫెవిక్విక్ ఎక్కడ నుంచి తెచ్చారు? తోటి విద్యార్థుల కళ్లలో ఆ జిగురు పోయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ పోసిన తోటి విద్యార్థులు
September 13, 2025
0
Tags