తమిళనాడులోని కరూర్‌లో టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదం మిగిల్చింది. విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 39కి పెరిగింది. ఈ ఘటనలో గాయపడినవారికి ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పరామర్శిచారు. అలాగే మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సైతం ఆయన పరామర్శించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీసన్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం విజయ్ ఆలస్యంగా ర్యాలీ వేదిక వద్దకు వచ్చారు. అభిమానులు, టీవీకే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ జరిగిన చోటుకు చేరుకుని ఆరు గంటలకు విజయ్ రాక కోసం ఎదురుచూశారు. విజయ్ అక్కడికి చేరుకుని తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నప్పుడు జనసమూహం ఉప్పొంగిపోయింది. అయితే అంచనాలకు మించి పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడటంతో వారిని నియంత్రించడం కష్టతరంగా మారింది. అలాగే తొక్కిసలాట వంటి పరిస్థితి చోటుచేసుకున్న తర్వాత కొందరు అక్కడి నుంచి బయటపడేందుకు ఇతరులను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగింది. కరూరులో తొక్కిసలాటకు ర్యాలీలో నెలకొన్న రద్దీ, విజయ్ పర్యటనలో జాప్యం, ప్రాథమిక సౌకర్యాల కొరత కారణమని తమిళనాడు డీజీపీ వెంకటరామన్ తెలిపారు. కరూర్ ర్యాలీ స్థలానికి విజయ్ మధ్యాహ్నం వస్తారని సోషల్ మీడియాలో ప్రకటించారని చెప్పారు. అయితే విజయ్ రాక ఆలస్యం కావడంతో మరోవైపు జనం అంచనాలకు మించి పెరిగారని అన్నారు. ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఇచ్చినట్టుగా తెలిపారు. అయితే విజయ్ అక్కడకు రాత్రి 7.40 గంటలకు చేరుకున్నారని చెప్పారు. అయితే అప్పటికే గంటల తరబడి ప్రజలు తగినంత ఆహారం, నీరు లేకుండా ఎండలో వేచి ఉన్నారని విజయ్ తెలిపారు. అలాగే జనం రద్దీ కూడా విపరీతంగా పెరిగిందని చెప్పారు. నిర్వాహకులు దాదాపు 10 వేల మంది వస్తారని చెప్పారని తెలిపారు. అయితే అక్కడికి దాదాపు 27 వేల మంది వచ్చారని పోలీసులు అంచనా వేసినట్టుగా చెప్పారు. అయితే తమ ఉద్దేశం ఎవరినీ నిందించడం కాదని.. వాస్తవాలు మాత్రమే చెబుతున్నామని తెలిపారు. మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన వేదిక వద్ద సుమారు 500 మంది పోలీసులు విధుల్లో ఉన్నారని వెంకటరామన్ చెప్పారు. మరింత పోలీసు బందోబస్తు ఉంటే ప్రజలకు తక్కువ స్థలం ఉండేదని అన్నారు. రెండు రోజుల క్రితం అదే ప్రాంతంలో ఒక ప్రధాన పార్టీ ర్యాలీ కూడా జరిగిందని... 20,000 మంది హాజరవుతారని అంచనాతో పోలీసులు రక్షణ కల్పించారని ఆయన అన్నారు. మరణించిన 38 మంది మృతదేహాలను గుర్తించామని, ప్రస్తుతం వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎస్ శరవణన్ తెలిపినట్టుగా పీటీఐ రిపోర్టు చేసింది. ఒక మహిళ గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదు శరవణన్ చెప్పారు. ఆ మహిళను గుర్తించే పని కొనసాగుతోందని... గుర్తింపు పూర్తైన తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. మృతులలో ఇప్పటివరకు 14 మందిని వారి బంధువులకు అప్పగించామని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని... వారిని మెరుగైన వైద్యం అందిస్తున్నారని, కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ సుగంధి రాజకుమారి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద 39 మృతదేహాలు ఉన్నాయని... 31 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించామని తెలిపారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్రం నివేదిక కోరింది. తమిళనాడులోని కరూర్‌లో టీవీకే చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటపై తమిళనాడు ప్రభుత్వం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరణాత్మక నివేదిక కోరిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
అంచనాలకు మించి జనం అక్కడ గుమిగూడటంతో తొక్కిసలాట : డీజీపీ వెంకటరామన్
September 28, 2025
0
Tags