అమెరికాలో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిరువురి విగ్రహాలు వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్‌లో కన్పించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ట్రంప్, ఎప్‌స్టైన్‌లు చేతులు పట్టుకొని, నవ్వుతూ ఉన్నట్లుగా ఉన్న ఈ విగ్రహాలు దాదాపు 12 అడుగులు ఉన్నాయి. ఎప్‌స్టైన్‌కు పుట్టినరోజు కానుకగా ట్రంప్ ఓ లేఖ రాసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని ప్రస్తావిస్తూ విగ్రహాల కింద ఫలకాలు ఏర్పాటుచేశారు. ఇక, ఈ విగ్రహం ఏర్పాటును వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ఈ విగ్రహాలకు డబ్బును వృథా చేసిన డెమోక్రాట్లు, మీడియా సంస్థలు.. ఎప్‌స్టైన్, అతని బాధితుల గురించి తెలిసినా వారికి ఎలాంటి సాయం చేయలేదని వైట్‌హౌస్ అధికారి ఒకరు విమర్శించారు. కానీ, ట్రంప్ ఎప్‌స్టైన్ కేసుకు సంబంధించి వేల ఫైళ్లను బయటపెట్టినట్లు తెలిపారు. అయినా, ఎప్‌స్టైన్‌తో సంబంధాలను ట్రంప్ ఎప్పుడో దూరం పెట్టారని స్పష్టం చేశారు.1990-2000 మధ్య ఫ్లోరిడాలో ట్రంప్, ఎప్‌స్టైన్‌లు పక్కపక్క నివాసాల్లో ఉండేవారు. కొంతకాలం తర్వాత ఎప్‌స్టైన్, ట్రంప్‌ల మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి. 2006 నుంచి తనతో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌ను 2019లో అరెస్టు చేశారు. అదే ఏడాది ఆగస్టులో అతడు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
వాషింగ్టన్ డీసీ నేషనల్ మాల్‌లో ట్రంప్-ఎప్‌స్టైన్ 'ఫ్రెండ్ షిప్ స్టాచ్యూ'
September 24, 2025
0
Tags