దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకోవడానికి ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ చాట్‌జీపీటీ సాయం తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. దాంతో ఓ మిలిటరీ ఐడీ డాక్యుమెంట్ సృష్టించినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్లు దక్షిణ కొరియా మిలిటరీ గుర్తింపు కార్డు నకిలీ ముసాయిదా తయారీ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వాడినట్లు తెలిసింది. ముసాయిదా నిజమైనది అని నమ్మించడానికి ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అవతలి వ్యక్తులు ఈ మెయిల్ పొందగానే వారి డేటాను దొంగిలించేలా దీనిని రూపొందించినట్లు జీనియన్స్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ దాడికి బాధ్యత వహించిన బృందాన్ని కిమ్‌సుకీ అని పిలుస్తున్నారు. కిమ్ ప్రభుత్వ ప్రాయోజిత ఈ సైబర్ ముఠా గతంలోనూ అనేకసార్లు దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది. దీనిపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ కూడా గతంలోనే హెచ్చరించింది. ఉత్తర కొరియా ప్రభుత్వం నుంచే ఈ ముఠాకు ఆదేశాలు అందుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నిఘా సమాచారాన్ని రాబట్టడమే వీరి పని అని చెప్పింది. తాజాగా హ్యాకర్లు ఏఐ వినియోగించడంపై జీనియన్స్ జులైలో పలు విషయాలు కనుగొంది. సొంతంగా కొన్ని ప్రయోగాలు కూడా చేసింది. చాట్ జీపీటీని ఫేక్ ఐడీలను తయారుచేయమని కోరగా అది తొలుత నిరాకరించిందట. తర్వాత ప్రాప్టింగ్ మార్చగా ముందుకెళ్లిందట. ఉత్తర కొరియా హ్యాకర్లు క్లాడ్ కోడ్ టూల్స్ వినియోగిస్తున్నారని 'ఆంత్రోపిక్' సైతం ఆగస్టులో హెచ్చరించింది. దాని సాయంతో యూఎస్ ఫార్చూన్ 500 కంపెనీల్లో నియమితులై రిమోట్‌గా హ్యాకర్లు పనిచేస్తున్నారని ఆరోపించింది. వారికి నకిలీ గుర్తింపులు, పాస్ కోడింగ్ అసెస్‌మెంట్లు రూపొందించడానికి క్లాడ్ తోడ్పడినట్లు తెలిపింది. తాజా ఫిషింగ్ లక్ష్యాలలో జర్నలిస్టులు, పరిశోధకులు, ఉత్తర కొరియాపై దృష్టిసారించే మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారు. సౌత్ కొరియా నుంచి మిలిటరీ మెయిల్ వచ్చిన తరహాలో నకిలీ మెయిల్స్ పంపించి వారిని బురిడీ కొట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎంతమంది సైబర్ బాధితులు ఉన్నారనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఉత్తర కొరియా హ్యాకర్లు తమ ఏఐ టూల్‌ను వినియోగిస్తున్నారనే సమాచారంపై స్పందించడానికి ఓపెన్ ఏఐ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. నకిలీ రెజ్యూమోలు, కవర్ లెటర్లు, సోషల్ మీడియా పోస్టులు తయారుచేస్తున్న కొన్ని అనుమానిత ఉత్తర కొరియా అకౌంట్లను నిషేధించినట్లు ఆ కంపెనీ ఫిబ్రవరిలో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఉత్తరకొరియా హ్యాకర్ల కొత్త పంథా !
September 15, 2025
0
Tags