ప్రాణం ఖరీదు ద్వారా నాకు ప్రాణం పోశారు : చిరంజీవి భావోద్వేగ పోస్ట్‌ షేర్

Telugu Lo Computer
0


తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా వెలుగులు నింపిన ఈ నటుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక భావోద్వేగ పోస్ట్‌ షేర్ చేశారు. '22 సెప్టెంబర్‌ 1978లో  నేను నటుడిగా మీ ముందుకు వచ్చాను. ప్రాణం ఖరీదు ద్వారా నాకు ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, చివరికి మెగాస్టార్‌గా నిలిపింది మీ ప్రేమే. నేటికి 155 సినిమాలను పూర్తి చేసుకున్నాను అంటే అది మీ నిస్వార్థమైన అభిమానం వల్లే సాధ్యమైంది. ఈ 47 ఏళ్లలో నేను అందుకున్న అవార్డులు, గౌరవాలు అని మీవే. మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి'' అని చిరు అభిమానుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 1978, సెప్టెంబర్ 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) అనే యువకుడు ప్రాణం ఖరీదు ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రలో నటించారు. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్‌ వంటి ప్రముఖులతో కలిసి తెరపై కనిపించిన ఆయన, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే - చిరు కథానాయకుడిగా తొలుత చేసిన చిత్రం పునాది రాళ్లు. కానీ, షూటింగ్‌ త్వరగా పూర్తి అయిన ప్రాణం ఖరీదు ముందుగా విడుదల కావడం, ఆయన కెరీర్‌లో చారిత్రాత్మక మలుపుగా మారింది. ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. మన శంకర వరప్రసాద్ గారు - అనిల్‌ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. విశ్వంభర - దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో ప్రేక్షకులను అలరించ నుంది. వీటితో పాటు శ్రీకాంత్‌ ఓదెల, బాబీ దర్శకత్వంలో మరో రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)