ప్రభుత్వానికి ఏపీ సచివాలయ ఉద్యోగుల నోటీసు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్ల విషయంలో మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యల్ని ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం దొరకడం లేదని భావిస్తున్న ఉద్యోగులు నేరుగా ఆందోళనలకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ అధికారులకు ఆందోళనలు చేపడతామని నోటీసు ఇచ్చారు. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ కు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆందోళన కార్యక్రమాల నోటీసు అందించింది. డైరెక్టర్ తో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన ఐక్యవేదిక నాయకులు.. ప్రభుత్వం స్పందించేలా చూడాలని కోరారు. దీంతో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డైరెక్టర్ వారికి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.25లక్షల గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు కోరుకుంటున్న అంశాల గురించి డైరెక్టర్ తో సుదీర్ఘంగా చర్చించినట్లు ఉద్యోగ నేతలు తెలిపారు. సచివాలయాల డైరెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళిన అంశాలలో ప్రధానంగా ఇంటింటికి తిరిగే విధుల నుండి విముక్తి కల్పించాలని, సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలని, సెలవు రోజుల్లో తప్పనిసరి విధులు లేకుండా చూడాలని కోరారు. అలాగే నోష్నల్ ఇంక్రిమెంట్లు,ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీం ద్వారా ఆరు సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించాలని,పదోన్నతులు కల్పించాలని,బదిలీలలో పారదర్శకత కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, దివ్యాంగ ఉద్యోగులకు క్షేత్ర స్థాయి విధుల నుండి విముక్తి కల్పించాలని, వార్డు విద్యా కార్యదర్శుల నుండి తొలగించిన విద్య అనే పదాన్ని తిరిగి కొనసాగించాలని, సంక్షేమ విద్యా సహాయకులు మరియు ఇంజనీరింగ్ సహాయకులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. అనంతరం ఐక్యవేదిక తరపున నిరసన కార్యక్రమాల గురించి పదిహేను రోజుల ముందస్తు సమాచారంతో నోటీసు అందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)