ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు !

Telugu Lo Computer
0


దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఈ నెలలోఅనేక కొత్త మోడల్ కార్లు సందడి చేయనున్నాయి. వియత్నాంకు చెందిన కొత్త కంపెనీల నుంచి మన దేశీయ దిగ్గజాలైన మహీంద్రా, మారుతి సుజుకి వరకూ పలు కంపెనీలు తమ సరికొత్త మోడళ్లను, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మహీంద్రా, విన్‌ఫాస్ట్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ నెలలో తమ కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. ఈ కార్లలో కొన్ని ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా రావడం విశేషం. 

వియత్నాంకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ మొదటిసారిగా భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. సెప్టెంబర్ 6న విన్‌ఫాస్ట్ కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు 'విన్‌ఫాస్ట్ VF6'ను విడుదల చేయనుంది. హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనిచ్చే ఈ కారులో అధునాతన ఫీచర్లు ఉంటాయని అంచనా. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20-25 లక్షల మధ్య ఉండవచ్చు. విన్‌ఫాస్ట్ కంపెనీ VF6తో పాటు సెప్టెంబర్ 6న మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు 'విన్‌ఫాస్ట్ VF7'ను కూడా లాంచ్ చేయనుంది. ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ9ఈ, టాటా హారియర్ ఈవీ వంటి కార్లకు పోటీనిస్తుంది. VF6తో పోలిస్తే VF7 కాస్త ఖరీదైనదిగా ఉండవచ్చు. దీని ధర రూ.25-30 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం.

ఆఫ్-రోడింగ్‌కు మరొక పేరు మహీంద్రా థార్. ఇప్పటికే 5 డోర్ల మోడల్‌తో వినియోగదారుల ఆదరణ పొందిన మహీంద్రా, ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన 3 డోర్ల థార్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. ఇది సెప్టెంబర్ మొదటి వారంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్‌లో పాత వెర్షన్‌తో పోలిస్తే కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇది థార్ అభిమానులకు గొప్ప ఆకర్షణ కానుంది.

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కంపెనీ తమ కొత్త కారు 'బసాల్ట్ ఎక్స్'ను సెప్టెంబర్ 5న విడుదల చేయనుంది. ఈ కారు కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. 'బసాల్ట్ ఎక్స్' కారును కేవలం రూ.11 వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కారును మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుస్తాయి.

మారుతి సుజుకి కంపెనీ కూడా సెప్టెంబర్ 3న ఒక కొత్త కారును విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎస్కుడో అనే పేరుతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ బ్రెజా, గ్రాండ్ విటారా మోడళ్లకు మధ్యస్థంగా మార్కెట్లోకి వస్తుంది. మారుతి అరీనా షోరూంల ద్వారా ఈ కారు లభించనుంది. దీని ఎక్స్-షోరూం ధర రూ.9-18 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. మారుతి నుంచి రానున్న ఈ కొత్త మోడల్ కూడా మంచి అమ్మకాలు సాధించే అవకాశం ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)