దక్షిణ కొరియాకు సుంకాలు తగ్గించాలంటే $350 బిలియన్ల నగదు చెల్లించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అయితే దక్షిణ కొరియా దీనిని అసాధ్యమని పేర్కొంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని వెల్లడించింది. సుంకాల తగ్గింపులపై జూలైలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు తెలుస్తుంది. ట్రంప్ కొత్త షరతు ఉద్రిక్తతలను పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు. జూలైలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా దక్షిణ కొరియా వస్తువులపై సుంకాలను 25% నుంచి 15%కి తగ్గించడానికి అమెరికా అంగీకరించింది. ప్రతిగా సియోల్ – యూఎస్ ప్రాజెక్టులలో $350 బిలియన్లను పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. ఈ మొత్తాన్ని రుణాలు, హామీలు, ఈక్విటీ ద్వారా అందించాలి. అయితే, ట్రంప్ ఇప్పుడు ఈ డబ్బును నగదు రూపంలో డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు వై సుంగ్-లాక్ యూఎస్ ఆఫర్ చేసిన $350 బిలియన్ల నగదు చెల్లింపు అసాధ్యమం అని పేర్కొన్నారు. ఇంత పెద్ద నగదు చెల్లింపు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ కూడా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ కొరియా వద్ద దాదాపు $410 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. అయితే ఒకేసారి వాటన్నింటిని చెల్లింపు ప్రక్రియ అనేది దేశానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని చెబుతున్నారు. ఒప్పందం కొనసాగాలంటే కరెన్సీ మార్పిడులు వంటి రక్షణ చర్యలు అవసరమని లీ సూచించారు. ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం చర్చలు నిలిచిపోయాయి. అగ్రరాజ్యం నిధులపై ప్రత్యక్ష నియంత్రణ కోరుతుండగా, దక్షిణ కొరియా దీనిని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే నెలలో సియోల్‌లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంపై ఉంది. ఈ సమావేశానికి డోనాల్డ్ ట్రంప్ హాజరవుతారు. ఈ వేదికపై రెండు దేశాల మధ్య ఈ సమస్యకు పరిష్కారం కుదరవచ్చని కొరియా నాయకత్వం భావిస్తోంది.
దక్షిణ కొరియా $350 బిలియన్ల నగదు చెల్లించాలని ట్రంప్ డిమాండ్ : అసాధ్యమని పేర్కొన్న దక్షిణ కొరియా
September 28, 2025
0
Tags