మార్చి 31 నాటికి రాష్ట్రంలోని 163 టిడ్కో గృహ సముదాయాలు అందుబాటులోకి రానున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. కర్నూలు శివారులోని టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''2014-19 మధ్య సీఎం చంద్రబాబు 7లక్షల టిడ్కో గృహాలకు అనుమతించగా... అందులో 5లక్షల గృహాలకు పరిపాలనా అనుమతి తీసుకొని 4.74లక్షల గృహాల పనులు ప్రారంభించాం. ఆ తర్వాత 2019లో వచ్చిన ప్రభుత్వం 2.61లక్షల గృహాలు చాలని కుదించింది. గత ప్రభుత్వం ఖాళీ ఖజానా అప్పగించింది. రూ.10లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజల నుంచి వచ్చే పన్నులు అప్పులు తీర్చడానికే సరిపోతున్నాయి. అయినప్పటికీ.. అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపించాం. కర్నూలులో పదివేల టిడ్కో గృహాలతో చేపట్టిన టౌన్‌షిప్‌ను గత పాలకులు ఆపేశారు. రాష్ట్రం మొత్తం 163 టౌన్‌షిప్‌ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కర్నూలు నగరంలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జగన్నాథ గట్టుపై ఉన్న హౌసింగ్ కాలనీని హౌసింగ్ డిపార్ట్‌మెంట్ వారు చూస్తున్నారు. త్వరలో వాటిపై కూడా నిర్ణయం ఉంటుంది'' అని మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ బి.నవ్య, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యేల బొగ్గుల దస్తగిరి, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మార్చి 31 నాటికి టిడ్కో గృహ సముదాయాలు : మంత్రి నారాయణ
September 06, 2025
0
Tags