ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ వివాదం : 2.5 బిలియన్‌ డాలర్లతో సెటిల్‌మెంట్‌ చేసుకున్న అమెజాన్‌

Telugu Lo Computer
0


ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ వివాదం తలెత్తడంతో దాదాపు 2.5 బిలియన్‌ డాలర్ల (రూ.22 వేల కోట్లు)తో ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సెటిల్‌మెంట్‌ చేసుకుంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్న తర్వాత మళ్లీ దాన్ని క్యాన్సిల్‌ చేసుకునేందుకు కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారంటూ అమెజాన్‌పై అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా దీనిపై దర్యాప్తు జరిపిన ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో ఈ వివాదం పరిష్కారం కోసం 2.5 బిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు అమెజాన్‌ సిద్ధమయ్యింది. అనుకోకుండా ప్రైమ్‌లో చేరి తమ మెంబర్‌షిప్‌ను క్యాన్సల్‌ చేసుకోవడానికి ఇబ్బందిపడిన వినియోగదారులకు ఇందులోని 1 బిలియన్‌ డాలర్లను జరిమానా రూపంలో చెల్లించనున్నట్లు తెలిపింది. సెటిల్‌మెంట్ ఆర్డర్ వచ్చిన 90 రోజుల్లోపు ఈ డబ్బు కస్టమర్‌లకు తిరిగి చెల్లించే అవకాశముంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై ఫిర్యాదుల విషయంలో రెండేళ్లుగా విచారణ కొనసాగుతోందని బ్యూరో ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టర్ క్రిస్ ముఫారిజ్ తెలిపారు. కస్టమర్లు ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోకుండా వస్తువులు కొనుగోలు చేయడాన్ని అమెజాన్ ఉద్దేశపూర్వకంగానే కష్టతరం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. దీనిపై అనేకసార్లు అప్పీళ్లకు వెళ్లడానికి బదులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో అమెజాన్‌ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందన్నారు. సెటిల్‌మెంట్‌లో భాగంగా అమెజాన్‌ తమ సేవలకు సంబంధించిన అన్ని విషయాలను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అయితే తాము అన్ని విషయాల్లో చట్టపరంగానే ముందుకువెళ్తామని, ఈ విషయంలో తమ తప్పేమీ లేదని అమెజాన్‌ ప్రతినిధి మార్క్ బ్లాఫ్కిన్ పేర్కొన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకొని ఇతర సేవలపై దృష్టిపెట్టడానికే 2.5 బిలియన్‌ డాలర్లను చెల్లించడానికి అంగీకరించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందేందుకు, దానిని రద్దు చేసుకోవడాన్ని మరింత సరళంగా చేయడానికి తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)