రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడు కోసం 1.5 కిలో మీటర్ల దూరం వెనక్కు వచ్చిన కొండవీడు ఎక్స్ ప్రెస్ : వీడియో వైరల్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని గజ్జలకొండ - మార్కాపురం రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడిన ఒక ప్రయాణీకుడి కోసం రైలు వెనక్కు మళ్లిన ఘటన సంచలనంగా మారింది. ఆ ప్రయాణీకుడి కోసం దాదాపు 1.5 కిలో మీటర్ల దూరం వెనక్కు వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. గాయపడిన వ్యక్తిని బోగీలో ఎక్కించి మార్కాపురం రైల్వే స్టేషన్ తీసుకురాగా 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయినా పరిస్థితి విషమించి ఆ వ్యక్తి మృతి చెందారు. గుంటూరు జిల్లా కు చెందిన హరిబాబు మరో నలుగురితో కలిసి యలహంక భవన నిర్మాణ పనుల కోసం బయల్దేరారు. వీరంతా గుంటూరులో కొండవీడు ఎక్స్ ప్రెస్ ఎక్కారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గజ్జల కొండ దాటిన తరువాత హరిబాబు భోజనం చేసి వాష్ బేసిన్ వద్ద చేతులు శుభ్రం చేసుకొని గేటు వద్ద నిలుచున్నాడు. అదే సమయంలో రైలు భారీ కుదుపులకు గురవ్వగా హరిబాబు జారి కింద పడిపోయారు. గుర్తించిన ప్రయాణీకులు అలర్ట్ అయ్యే సరికి రైలు 1.5 కిలో మీటర్లు ముందుకు వెళ్లింది. చైన్ లాగటంతో రైలు ఆగింది. విషయం తెలుసుకున్న లోకో పైలెట్ గుంటూరు రైల్వే అధికారుల అనుమతి తీసుకొని రైలును 1.5 కిలో మీటర్లు వెనక్కు తీసుకెళ్లారు. పట్టాలు పక్కన ఉన్న హరిబాబును గుర్తించారు. వెంటనే బోగీలోకి ఎక్కించి మార్కాపురం రైల్వే స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ సిద్దంగా ఉన్న 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి హరిబాబు మృతి చెందారు. అయితే, ప్రయాణీకుడు జారి పడిటంతో రైలు వెనక్కు రావటం బోగీలోకి ఎక్కించుకొని ప్రాణాలు కాపాడేందుకు తీసుకొని వెళ్లిన ఘటన పైన ఇప్పుడు వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)