నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం హింసకు దారి తీసింది. నేడు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికిపైగా గాయపడ్డారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్ వద్ద దూసుకొస్తున్న క్రమంలో భద్రతా దళాలతో ఘర్షణ జరిగింది. దీంతో కాల్పులు జరిపి ఆందోళనకారులను అదుపు చేయాల్సి వచ్చింది. వేల మంది యువతతో ఖాట్మాండ్ జనసముద్రంగా మారిపోయింది. పోలీసులు ప్రకటించిన నిషేధిత జోన్లను కూడా వారు లెక్కచేయలేదు. గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డిన్ వంటి సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం గత గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగస్టు 28 నుంచి ఏడురోజుల్లోగా రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ గడువు బుధవారం రాత్రి తీరిపోయినా అవి రిజిస్టర్ కాలేదు. టిక్‌టాక్, వైబర్, విట్క్, నింబజ్, పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తోంది. ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధం వల్ల చదువు కోసమో, సంపాదన కోసమో విదేశాల్లో ఉంటున్న 70 లక్షల మంది నేపాలీ యువత స్వదేశంలో కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంభాషించే అవకాశం కోల్పోతారు. ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకరమనీ, రాజ్యాంగం భరోసా ఇచ్చిన సమాచార హక్కునూ కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.
నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం హింసకు దారి తీసిన ఆందోళనలు : 13 మంది మృతి
September 08, 2025
0
Tags