ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్, సిడోర్జో ప్రాంతంలోని అల్ ఖోజిని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ భవనం సోమవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద సుమారు 65 మంది చిక్కుకుపోయి వుండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఈ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సహా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మహిళా విద్యార్థులు భవనంలోని మరో విభాగంలో ప్రార్థనలు చేస్తుండటంతో వారు తప్పించుకున్నారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు, సైనికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 102 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎనిమిది గంటలపాటు కొనసాగిన తవ్వకాల్లో ఎనిమిది మంది గాయపడిన విద్యార్థులను ప్రాణాలతో బయటకు తీశారు. శిథిలాల కింద ఇంకా అనేక మృతదేహాలు ఉన్నట్లు గమనించాం. కానీ ప్రస్తుతానికి బతికే ఉన్న వారిని రక్షించడంపైనే దృష్టి సారిస్తున్నాం అని రెస్క్యూ ఆపరేషన్ అధికారి నానాంగ్ సిగిట్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 80 మందికి పైగా గాయపడ్డారు. తలకు గాయాలు, ఎముకలు విరగడం వంటి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇండోనేషియాలో కూలిన ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ భవనం : ఒక విద్యార్థి మృతి, 100 మందికి పైగా గాయాలు
September 30, 2025
0
Tags