అమెరికాకు చెందిన ఆడమ్ రైన్ అనే ఓ యువకుడి ఆత్మహత్య ఘటనలో చాట్‌జీపీటీ పాత్ర ఉందంటూ అతడి తల్లిదండ్రులు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై దావా వేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఓపెన్‌ఏఐ చర్యలు చేపట్టింది. చాట్‌జీపీటీలో పేరెంటల్ కంట్రోల్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫీచర్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో మాథ్యూ, రైన్ దంపతులు దాఖలు చేసిన కేసు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓపెన్‌ఏఐ బ్లాగ్‌లో వెల్లడించింది. ఏప్రిల్ 11న వారి కుమారుడు ఆడమ్ రైన్ (16) ఆత్మహత్య చేసుకున్న ఘటనలో చాట్‌జీపీటీ పాత్ర ఉందని వారు ఆరోపించారు. చాట్‌బాట్ అతని ఆత్మహత్య ఆలోచనలను ప్రోత్సహించడమే కాకుండా, స్వీయహాని పద్ధతులు, ఆత్మహత్య నోట్ తయారుచేయడంలో కూడా మార్గనిర్దేశం చేసిందని, ఆ ప్రయత్నాలు తల్లిదండ్రులకు తెలియకుండా దాచుకోవాలని కూడా సలహా ఇచ్చిందని తెలిపారు. ఇకనైనా చాట్‌జీపీటీలో స్వీయహాని పద్ధతుల కోసం వెతికిన సమయంలో అటువంటి సమాచారాన్ని అందివ్వకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై ఓపెన్‌ఏఐ ప్రతినిధి స్పందిస్తూ ఆడమ్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. 2023 నుంచే చాట్‌జీపీటీలో స్వీయహాని సూచనలు ఇవ్వకుండా, హెల్ప్‌లైన్ నంబర్లకు మళ్లించేలా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అయితే దీర్ఘకాలికంగా జరిగే సంభాషణల్లో ఇది పూర్తిస్థాయిలో పని చేయకపోవచ్చని అంగీకరించారు. భవిష్యత్తులో వినియోగదారులు ఒక్క క్లిక్‌తో అత్యవసర సేవలకు చేరుకునేలా, అలాగే లైసెన్స్‌డ్ థెరపిస్టులతో నేరుగా కనెక్ట్ అయ్యే ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు సంస్థ తెలిపింది. టీనేజర్ల కోసం కొత్తగా పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లు తీసుకొచ్చి, తల్లిదండ్రులు తమ పిల్లల చాట్‌జీపీటీ వినియోగాన్ని పర్యవేక్షించే అవకాశం కల్పించనుంది. అత్యవసర పరిస్థితుల్లో అలర్ట్ చేసేలా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ను కూడా జోడించే ఆప్షన్ తీసుకురానుంది. ప్రస్తుతం 30 దేశాల్లో 90 మందికి పైగా వైద్యులతో కలిసి పనిచేస్తున్నామని, మరికొందరు నిపుణుల సూచనలతో భద్రతా ఫీచర్లను నిరంతరం మెరుగుపరుస్తామని ఓపెన్‌ఏఐ తెలిపింది.
చాట్‌జీపీటీలో పేరెంటల్ కంట్రోల్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫీచర్లు !
August 28, 2025
0
Tags