కంపెనీలు కృత్రిమ మేధ పేరు చెప్పి ఎలా ఉద్యోగాలను కోసేస్తున్నాయో అలానే ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు కూడా వర్చువల్ ఇంటర్వ్యూల్లో ఏఐ సాయం తీసుకొని కొలువులు కొట్టేస్తున్నారు. దీంతో టెక్ కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. కొన్ని యూ టర్న్ తీసుకొని ముఖాముఖీ ఇంటర్వ్యూలను మొదలుపెట్టాయి. కొన్ని నెలల క్రితం పిన్‌డ్రాప్ సెక్యూరిటీ అనే వాయిస్ అథెంటికేషన్ స్టార్టప్ సీనియర్ ఇంజినీర్ పోస్టు భర్తీ కోసం వర్చ్యూవల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ సమయంలో ఓ రష్యన్ కోడర్ కూడా వాటికి హాజరయ్యాడు. అతడి పేరు ఇవాన్. మంచి క్వాలిఫికేషన్ ఉంది. వీడియో ఇంటర్వ్యూ సమయంలో అతడు సమాధానాలు చెబుతుంటే ముఖ కవళికలకు, మాటలకు మధ్య పొంతన లేకుండా ఉండటాన్ని రిక్రూటర్ గుర్తించారు. చివరికి ఇవాన్ ఓ స్కామర్ అని, అతడు డీప్‌ఫేక్ సాఫ్ట్‌వేర్, జనరేటీవ్ ఏఐ టూల్స్ వాడి టెక్‌కంపెనీలో ఉద్యోగానికి యత్నించినట్లు తేలిందని 'పిన్‌డ్రాప్' సీఈవో విజయ్ బాల సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. వీడియో ఇంటర్వ్యూల్లో సాధారణ మనిషికి ఏఐ రూపానికి మధ్య తేడాలను గుర్తించడం కష్టమని చెప్పారు. ఫేక్ గుర్తింపు, ఫేక్ ముఖాలు, ఫేక్ గొంతును వాడి ఉద్యోగాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఫేస్ స్వాపింగ్ టెక్నిక్ ద్వారా మరొకరిని ఇంటర్వ్యూలకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. రీసెర్చ్ అడ్వైజరీ సంస్థ గార్ట్నర్ అంచనాల ప్రకారం ఏఐ జనరేటెడ్ ప్రొఫైల్స్ ఇలానే పెరిగితే మాత్రం 2028 నాటికి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే ప్రతి నలుగురిలో ఒకరు ఫేక్‌గా తేలుతారు. ఇలాంటి మార్గాల్లో వచ్చేవారు కంపెనీల్లో చేరాక సిస్టమ్స్‌లోకి మాల్‌వేర్ వంటివి ఇన్‌స్టాల్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ప్రమాదం ఉందని విజయ్ బాల సబ్రహ్మణ్యన్ అభిప్రాయపడ్డారు. సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీ సంస్థలు తరచూ రిమోట్ విధానంలో పనిచేసే ఉద్యోగాల్లో నియమకాలు చేపడుతుంటాయి. వీటికి అత్యధికంగా ఫేక్ అభ్యర్థులు వస్తున్నారని నిపుణులు వెల్లడించారు. బ్రైట్‌హైర్ సీఈవో బెన్ సెస్సెర్ మాట్లాడుతూ ఏడాది క్రితం తొలిసారి ఇలాంటి మోసాలను చూశామన్నారు. ఇటీవల కాలంలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. ఏఐ ఆధారిత రెజ్యూమే మోసాలు బాగా జరుగుతున్నయని 63 శాతం మంది రిక్రూటర్లు నమ్ముతున్నట్లు ఇటీవల సాఫ్ట్‌వేర్ ఫైండర్ నిర్వహించిన పోల్‌లో తేలింది. 37శాతం మంది వీడియో మోసాలు భవిష్యత్తులో నియామకాలపై పెను ప్రభావం చూపుతాయంటున్నారు. ఇక ఏఐ జనరేటెడ్ ప్రొఫైల్స్ లేదా వర్క్ శాంపిల్స్ 51%, ఫేక్ రిఫరెన్స్‌లు42%, ఫేక్ క్రెడెన్షియల్స్39%, వాయిస్ ఫిల్టర్లు లేదా క్లోనింగ్‌లు17%, వీడియోలో ఫేస్ స్వాపింగ్ 15% మంది చూసినట్లు వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం ఏఐ సాయంతో ఏఐ టూల్స్ సాయంతో వీడియోలో ముఖాన్ని మార్చుకొని జరిగిన అభ్యర్థి ఇంటర్వ్యూను విడోక్ సెక్యూరిటీ సహవ్యవస్థాపకుడు డేవిడ్ మోక్జాడ్లో షేర్ చేశారు. సదరు అభ్యర్థి ముఖాముఖీలో సమాధానాలు ఇచ్చేందుకు చాట్ జీపీటీ కూడా వాడినట్లు గుర్తించారు. గూగుల్‌లో ఉద్యోగానికి అభ్యర్థులతో ముఖాముఖీ ఇంటర్వ్యూల విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని కొన్నాళ్ల క్రితం సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎన్‌బీసీ కథనంలో పేర్కొంది. వర్చువల్ నియామకాల విధానంలో ఇటీవల కృత్రిమ మేధ సాయంతో మోసాలు పెరిగిపోవడంపై స్పందిస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. కొవిడ్ సమయంలో అమల్లోకి తెచ్చిన రిమోట్ రిక్రూట్‌మెంట్ విధానం నుంచి గూగుల్ మళ్లీ పాతబాట పట్టింది. 65శాతం నియామక నిపుణులు కచ్చితంగా ముఖాముఖీ ఇంటర్వ్యూలకు మద్దతు ఇస్తున్నట్లు సాఫ్ట్‌వేర్ ఫైండర్ పోల్‌లో తేలింది. క్యాండెడేట్ ఐడేంటిఫికేషన్ ప్రక్రియకు ఇది ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. దీంతోపాటు సదరు అభ్యర్థి నేపథ్యాన్ని కూడా తనిఖీలు చేసుకోవడానికి 54శాతం అనుకూలంగా ఉన్నారు. ఏఐ ఆధారిత మోసాలను గుర్తించేందుకు ఇప్పటికే తమ రిక్రూటర్లకు కంపెనీలు శిక్షణలు కూడా ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు డీప్‌ఫేక్ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్‌లను కూడా వినియోగిస్తున్నాయి.
ఏఐ ఇంటర్వ్యూల నుంచి ముఖాముఖీ ఇంటర్వ్యూలకు మళ్ళిన టెక్ కంపెనీలు !
August 28, 2025
0
Tags