సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత

Telugu Lo Computer
0


సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీపీఐ ప్రధాన కార్యాలయం మఖ్దూం భవన్‌లో ఉంచనున్నట్లు పార్టీ వర్గాల్లు వెల్లడించాయి. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్‌ కాలేజీకి అప్పగిస్తామని తెలిపారు. అదేవిధంగా నేత్రాలను ఎల్వీ ప్రసాద్‌ నేత్రాలయానికి దానం చేయబడ్డాయని పేర్కొన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించారు. 1998, 2004లో రెండుసార్లు నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్‌ఎఫ్‌ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సీపీఐ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. చండ్ర రాజేశ్వర్‌రావు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్రసమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సురవరం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, ఓయూ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో సుధాకర్‌రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

మంచి మిత్రుడ్ని కోల్పోయా.. సురవరం భౌతికకాయానికి దత్తాత్రేయ నివాళి

సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బండారు దత్తాత్రయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. సురవరం భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యార్థి నాయకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని దత్తాత్రేయ కొనియాడారు. నల్గొండ లోక్‌సభ సభ్యునిగా పార్లమెంటులో చురుకైన పాత్ర పోషించి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారన్నారు. లోతైన జ్ఞానమున్న నాయకులని, నీతి నిజాయితీకి మారుపేరని పేర్కొన్నారు. సిద్ధాంత వైరుధ్యం ఉన్నప్పటికీ సురవరం సుధాకర్ రెడ్డి విమర్శలు సున్నితంగా చేసేవారని, అనేక విషయాలపై తనతో చర్చించి సమాధానం కూడా సూచించేవారని గుర్తుచేసుకున్నారు. తాను ఆహ్వానించినప్పుడు అనేక సార్లు 'అలాయ్ బలాయ్ ' కార్యక్రమంలో పాలొన్నారన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని.. కష్ట సమయాన ఈ బాధను తట్టుకోవాలని… కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)