ఆంధ్రప్రదేశ్ లో విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యమిస్తూ చేసే పాలనతో అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, అభివృద్ధి సూచికలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యమని సీఎం అన్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలని.. కనీస అవసరాలు అందించాలని దిశానిర్దేశం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి రూ. 5.42 లక్షలు తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ ఉండాలన్నారు. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పరిశ్రమలో తయారైన వేస్ట్ మరో పరిశ్రమకు ముడి సరకు అయ్యేలా సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలని చంద్రబాబు సూచించారు. అత్యుత్తమ సాంకేతికతను పాలనకు అనుసంధానించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఉత్పత్తులకు విలువ జోడింపు కీలకమన్న సీఎం.. దాని ద్వారానే రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. మైనింగ్, వ్యవసాయ ఉత్పత్తుల్లో జీవీఏ ప్రధాన అంశమన్నారు. జీఎస్డీపీ వృద్ధి చెందితేనే ప్రజలకు మరింత సంక్షేమం, అభివృద్ధి అందించగలమని చెప్పారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీ తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు.
ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యం : సీఎం చంద్రబాబు
August 04, 2025
0
Tags