తిరుమలలో శ్రీవారి దర్శనం భక్తులు త్వరగా చేసుకునేలా ఏఐ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందని ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో ఒకటి నుంచి రెండు గంటల్లోనే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా కొత్త మోడల్ అమలులోకి వస్తుందని చెప్పారు. అలాగే భక్తుల ఇబ్బందులు తగ్గించే క్రమంలో, వీఐపీ దర్శనం ఉదయం 8 నుంచి 8.30లోపు ముగిసేలా సమయాలను మార్చినట్లు చెప్పారు. శ్రీవాణి దర్శనం కూడా ఇకపై త్వరితంగా పూర్తయ్యేలా సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు. తిరుమలలో రాజకీయ చర్చలు నిషేధించడంతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని నాయుడు తెలిపారు. వైకాపా నేతలు తిరుమలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని సహించబోమని హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రోజా వంటి నేతల అవినీతి వివరాలు తన దగ్గర ఉన్నాయని ఆరోపించారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత సిబ్బందిని వేరే విభాగాలకు బదిలీ చేసినట్లు, కొంతమందికి వాలంటరీ రిటైర్‌మెంట్ ఇచ్చినట్లు నాయుడు వెల్లడించారు. అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల కొండపై రోజూ సుమారు రెండు లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని సేవిస్తున్నారని తెలిపారు. వడల వంటి కొత్త పదార్థాలు మెనూలో చేర్చారని చెప్పారు. అలాగే ఒంటిమిట్టలో అన్నదానం కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తిరుమలలో భక్తుల భద్రత కోసం అలిపిరి వద్ద కొత్త స్కానర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి దర్శనాలు, ప్రసాదాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాదిలో 30 వేల నకిలీ వెబ్‌సైట్లను క్రాష్ చేశామని తెలిపారు. గత పాలనలో వైసీపీ నేతలు హోటళ్ల కేటాయింపులో మాఫియాలా వ్యవహరించారని, ఇప్పుడు మాత్రం ఈ-టెండర్ల ద్వారా పారదర్శకంగా కేటాయింపులు జరుగుతున్నాయని నాయుడు అన్నారు. తిరుమలలో కొత్త క్యాంటీన్లు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. మతమార్పిడులను అరికట్టే క్రమంలో దేశ వ్యాప్తంగా కొత్త ఆలయాలు నిర్మించడానికి టీటీడీ చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 320 ఆలయాలు నిర్మించగా, మరిన్ని 500-1000 ఆలయాలు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో ఆలయాలు ఉన్నాయని, మిగతా రాష్ట్రాల్లో కూడా నిర్మించేందుకు ముఖ్యమంత్రులకు లేఖలు రాశామని తెలిపారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న సిమ్స్‌లో 600 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యత కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశామని చెప్పారు. తిరుమల బర్డ్ ఆసుపత్రి విస్తరణపై కూడా దృష్టి సారించామన్నారు. జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఎప్పుడైనా శ్రీవారికి తలనీలాలు సమర్పించారా? ప్రసాదం తిన్నారా?" అంటూ బీఆర్ నాయుడు ప్రశ్నించారు. హిందూ ధర్మంపై దాడులు చేయడం సరైంది కాదని హెచ్చరించారు. "మీరు ఎవరితో అయినా పెట్టుకోండి కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారం చేయొద్దు" అంటూ వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ ద్వారా భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం !
August 20, 2025
0
Tags