జీనియస్ డిజిపోల్ అనే మానవ వనరుల కన్సల్టెన్సీ 'పని గంటల పొడిగింపు' అంశంపై ఇటీవల ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. పని గంటల పొడిగింపు వ్యక్తిగత సమయం, ఆరోగ్యంతోపాటు పని-జీవన సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది అభిప్రాయపడినట్లు తేలింది. జులై 1 నుంచి 31 మధ్య కాలంలో చేసిన ఈ సర్వేలో దాదాపు 2076 మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు వెల్లడించింది. ఇందులో మెజార్టీ ఉద్యోగులు వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పగా, తగిన పరిహారం అందిస్తే ఎక్కువ పని గంటల విషయాన్ని అంగీకరిస్తామని సర్వేలో పాల్గొన్న 40శాతం మంది చెప్పారు. మరో 16శాతం మంది మాత్రం ఈ విధానాన్ని ప్రయత్నించేందుకు సంసిద్ధంగా ఉన్నామని లేదా ఉత్పాదకతను మరింత పెంచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నామని అన్నారు. పని గంటలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం, పారదర్శకతపై ఉద్యోగులు స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ సంప్రదింపుల్లో తమకు కూడా భాగస్వామ్యం ఉండాలని దాదాపు 79 శాతం మంది కోరుకున్నట్లు తెలిపింది. అంతేకాదు అటువంటి చర్చలు బహిరంగంగా ఉండటంతోపాటు విధాన రూపకల్పన పారదర్శకంగా జరగాలని ఆశిస్తున్నారని పేర్కొంది. నేటి శ్రామికశక్తి మార్పునకు వ్యతిరేకంగా లేదు. నిష్పక్షపాత, ఆలోచనలను పంచుకోవడం, సంప్రదింపులను కోరుకుంటోంది. ఆలోచనాపరమైన ప్రణాళిక లేకుండా ఎక్కువ పని చేయించడం ఉద్యోగులు, యాజమాన్యాల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఉత్పాదకత అనేది కేవలం ఉద్యోగులు వెచ్చించే సమయంపైనే కాకుండా వాళ్ల శక్తి యుక్తులపై ఆధారపడి ఉంటుందని సంస్థలు గుర్తించాలని జీనియస్ హెచ్‌ఆర్‌టెక్ వెల్లడించింది.
పని గంటల పొడిగింపు వ్యక్తిగత సమయం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది : జీనియస్ డిజిపోల్
August 24, 2025
0
Tags