బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు వివరించారు. అయితే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనేది మాత్రం తెలంగాణ బీజేపీ చీఫ్ వెల్లడించలేదు. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది త్వరలో చెబుతామని అన్నారు. వారు బీజేపీలో చేరే తేదీలతో సహా అన్ని వివరాలు వెల్లడిస్తామని రాంచందర్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేని ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరేది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాదని.. రానున్న రోజులు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆగస్ట్ 10వ తేదీ రోజున అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ పార్టీలో చేరనున్నట్లు వివరించారు. ఇది బీజేపీలో చేరికలకు తొలి అడుగు మాత్రమేనని.. ఇక నుంచి వలసలు పెరుగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాషాయ తీర్థం పుచ్చుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో హాట్ టాపిక్‌గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపైనా రాంచందర్ రావు స్పందించారు. ఈ కేసును సిట్ కాకుండా సీబీఐకి అప్పగిస్తేనే అసలు దోషులు ఎవరు అనేది బయటికి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఓడిపోతామనే భయంతోనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక దేశంలో ఓటర్ల జాబితా వివరాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన అసహనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీల మీద కొత్తగా ప్రేమ వచ్చిందంటూ రాంచందర్ రావు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో చేరనున్న ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
August 08, 2025
0
Tags