బీహార్‌లో ఆగస్టు 17 నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర చేపట్టనున్నట్లు హస్తం పార్టీ పేర్కొంది. ఈ యాత్రకు ‘ఓటర్ అధికార్ యాత్ర’ అని పేరు పెట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. బీహార్ లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన రాష్ట్రంలో 16 రోజుల పాటు ఉండనున్నారు. ఈ సమయంలో ఆయన 24 జిల్లాల్లో పర్యటిస్తారని కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్ తెలిపారు. యాత్రకు సంబంధించిన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని ఎంపీ తెలిపారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ర్యాలీతో ‘ఓటు అధికార్ యాత్ర’ ముగుస్తుందన్నారు. యాత్రలో ఇండియా కూటమీలోని అన్ని పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. రాహుల్ గాంధీ తన యాత్రను ససారాం నుంచి ప్రారంభిస్తారని అఖిలేష్ ప్రసాద్ సింగ్ అన్నారు. ఈ యాత్రకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ కాకుండా, మూడు వామపక్ష పార్టీలు సహా ఇతర కూటమి పార్టీల సభ్యులు కూడా ససారాంలో రాహుల్ గాంధీతో చేరవచ్చని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 పాట్నాలోని గాంధీ మైదానంలో యాత్ర ముగిస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆగస్టు 17 నుంచి జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’తో బీహార్ నుంచి ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా తాము ప్రత్యక్ష పోరాటం చేస్తామని అన్నారు. ఇది కేవలం ఎన్నికల సమస్య కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అనే సూత్రాన్ని రక్షించడానికి చేయనున్న ఒక నిర్ణయాత్మక యుద్ధం అని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి బీహార్ యువత తమతో పాటు వస్తారని అన్నారు. యువతందరూ వచ్చి తమతో చేరి రాజ్యాంగాన్ని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
రేపటి నుంచి బీహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’
August 16, 2025
0
Tags