ఎక్స్ ఖాతాలో షేర్ చేయబడిన మీడియోలో ఓ యువకుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గుర్తించారు. అయితే ప్రయాణికుడికి జరిమానా విధించడం లేదంటే తదుపరి స్టేషన్‌లో అతన్ని రైలు నుంచి దించేయడం వంటివి చేయాలి. వీటికి బదులుగా ఆ అధికారి అతన్ని రైలు నుంచి బలవంతంగా బయటకు తోసెయ్యడం వీడియోలో కనిపిస్తుంది. అదే ట్రైన్‌లో ఉన్న ఇతర ప్రయాణీకులు ఆ అధికారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పైగా అడిగిన వారిపై కూడా ఆర్‌పీఎఫ్ అధికారి కన్నెర్ర చేశాడు. ఓ ప్రయాణికుడు రహస్యంగా ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై వేలాది మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టికెట్ లేకుండా ఆ యువకుడు ప్రయాణిస్తుంటే, అతనికి జరిమానా విధించాలి. లేదా తదుపరి స్టేషన్‌లో అతన్ని దించేయాలి. అంతేకానీ అతన్ని కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేయడం ఏంటి? యూనిఫాం ధరించడం వల్ల మీరు దేవుడిగా మారారా? అంటూ ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న సదరు RPF అధికారిపై రైల్వే మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీలోని ఆర్‌పీఎఫ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వీడియోలో కనిపించిన కానిస్టేబుల్‌ను దయా బస్తీలోని ఆర్‌పీఎఫ్ రిజర్వ్ లైన్‌కు తరలించామని, డివిజనల్ స్థాయి విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 18, 2025న ఢిల్లీ సారాయ్ రోహిల్లా స్టేషన్‌లో జరిగిందని తెలిపింది. వీడియోలోని యువకుడు నెంబర్ 22482 ఉన్న రైలు అలారం గొలుసు లాగడంతో ఆగిపోయిందని, ఆర్‌పీఎఫ్ అధికారికి సరైన గుర్తింపు వివరాలను అందించకపోవడంతో ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకుతోసే ప్రయత్నం చేశాడని ఆర్‌పీఎఫ్ పేర్కొంది. సంఘటన సమయంలో రైలు ప్లాట్‌ఫారమ్ వద్ద నిలబడి ఉందని, కదులుతున్న రైలు నుంచి ప్రయాణీకుడిని తోసివేశారనేది తప్పుడుడు ఆరోపణ అని స్పష్టం చేసింది.
రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్
August 21, 2025
0
Tags