ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను మార్చిన కియా కార్ల పరిశ్రమ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  శ్రీసత్యసాయి జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రాకతో పరోక్షంగా, ప్రత్యక్షంగా 30 వేలమందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలవారు ఉన్నారు. స్థానికంగా పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, రొద్దం మండలాలలో సరికొత్త జోష్‌ వచ్చింది. స్థానికంగా వేలాదిమంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. కియ కార్ల పరిశ్రమ మొదట 2017లో ఏర్పాటైంది. పెనుకొండ మండలం అమ్మవారిపల్లిలో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది. ఆ తరువాత దాని అనుబంధ పరిశ్రమలు ఒక్కొక్కటిగా సుమారు 20కి పైగా వచ్చాయి. పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో ఇవి విస్తరించాయి. మూడేళ్ల క్రితం వరకు పెనుకొండ చుట్టూ ఉన్న పరిశ్రమలు ప్రస్తుతం గోరంట్ల మండలంలోకి విస్తరించాయి. పాలసముద్రం వద్ద కియ అనుబంధ పరిశ్రమలు పదికి పైగా ఉన్నాయి. ఒకప్పుడు కియ ప్రధాన పరిశ్రమలోనే ఉపాధి లభించగా,  ప్రస్తుతం 20 కి.మీ. పరిధి వరకు అవకాశాలు పెరిగాయి. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. కర్ణాటక నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించాక పాలసముద్రం నుంచి సుమారు 20 కి.మీ. పరిధిలో జాతీయ రహదారి పక్కన ఆధునిక రెస్టారెంట్లు, పెద్దపెద్ద భవంతులు కనిపిస్తాయి. జాతీయ రహదారికి ఆనుకుని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి మండలాల్లో ఎకరం భూమి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా పలికేది. కియ, అనుబంధ పరిశ్రమలు రావడంతో భూమి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్నిచోట్ల భూముల విలువ 20 నుంచి 40 రెట్లు పెరిగిందని ఈ ప్రాంత రైతులు అంటున్నారు. గోరంట్ల మండలంలో ఎకరం భూమి ఒకప్పుడు రూ.5 లక్షలు ఉండేది. కియకు తోడు పాలసముద్రం వద్ద మరిన్ని పరిశ్రమలు రావడంతో ఇప్పుడు ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల దాకా పలుకుతోంది. పెనుకొండ చుట్టుపక్కల పదేళ్ల క్రితం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలున్న ఎకరం భూమి ప్రస్తుతం రూ.1.5 కోట్లకు చేరింది. సోమందేపల్లి మండల కేంద్రంలో పదేళ్ల క్రితం సెంటు రూ.లక్ష ఉండగా, ప్రస్తుతం రూ.10 లక్షలకు పెరిగింది. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను కియ మార్చి వేసింది. కియ స్థిరపడ్డాక పలు అంతర్జాతీయ సంస్థలు జిల్లాకు వస్తున్నాయి. గోరంట్ల వద్ద నాసిన్‌ అకాడమీ ఏర్పాటైంది. ఎయిర్‌బస్‌, బెల్‌తో పాటు మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడికి వస్తోంది. నేడు ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఇటువైపు చూసేలా జిల్లా పారిశ్రామికంగా వృద్ధి చెందుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఇక్కడికి రావడంతో జాతీయ రహదారికి ఆనుకుని పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో టౌన్‌షి్‌పలు ఏర్పాటయ్యాయి. పాలసముద్రం సమీపంలో గుట్టలు, కొండలను చదును చేసి అపార్ట్‌మెంట్‌లు నిర్మించారు. ప్రస్తుతం పాలసముద్రం చుట్టూ పదుల సంఖ్యలో లే అవుట్లు వెలిశాయి. పాలసముద్రం జాతీయ రహదారి సర్కిల్‌లో పదుల సంఖ్యలో దుకాణాలు వృద్ధి చెందాయి. పాలసముద్రం వైపు మరిన్ని సంస్థలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసేందుకు వచ్చేవారికి అద్దెకు ఇచ్చేందుకు, అమ్మేందుకు ఇప్పటికే హిందూపురం రహదారిలో పదుల సంఖ్యలో విల్లాలు నిర్మించారు. గోరంట్ల-బెంగళూరు రహదారి పక్కన పాలసముద్రం సమీపంలో మరికొన్ని విల్లాలు ఏర్పాటవుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిలో ఈ ప్రాంతం దూసుకుపోతోంది. నగర వాతావరణాన్ని తలపించేలా పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ ప్రాం తంలో నివసిస్తున్నవారు మార్కెట్‌లో విడుదలైన కొత్త కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)